❇ ఎలిమినేటర్‌లో గుజరాత్ చిత్తు
❇ మరోసారి ఫైనల్ ఫైట్ లో ఢిల్లీ, ముంబై
డబ్ల్యూపీఎల్ మూడో సీజన్‌లో మాజీ ఛాంపియన్ ముంబై ఇండియన్స్ ఫైనల్ కు చేరుకుంది. ఇప్పటికే ఢిల్లి క్యాపిటల్స్ వరుసగా ఫైనల్స్‌కు చేరుకోగా.. తాజాగా ముంబై రెండోసారి ఫైనల్లో అడుగుపెట్టింది. ఈరోజు (గురువారం) జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్‌లో ఆతిథ్య ముంబై 47 పరుగుల తేడాతో గుజరాత్ జెయింట్స్‌ను చిత్తు చేసింది.
ఇక 15న (శనివారం) జరిగే టైటిల్ పోరులో హర్మాన్ సేన ఢిల్లీ క్యాపిటల్స్ తో తలపడనుంది. మాజీ ఛాంపియన్ ముంబై ఇండియన్స్… వరుస సీజన్లలో రన్నరప్ గా నిలిచిన ఢిల్లీ జట్లు మరోసారి టైటిల్ ఫైట్ లో ఢీ కొననున్నాయి.
కాగా, నేటి మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై… నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 213 పరుగుల భారీ స్కోరు చేసింది. హీలీ మాథ్యూస్ (77), నాట్ స్కైవర్-బ్రంట్ (77) హాఫ్ సెంచరీలతో విధ్వంసం సృష్టించగా.. ఆ తర్వాత కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ (36) మెరుపులు మెరిపించింది. దీంతో ముంబై జట్టు భారీ స్కోరు సాధించింది.
అనంతరం 214 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన గుజరాత్ జెయింట్స్ 19.2 ఓవర్లలో 166 పరుగులకే కుప్పకూలింది. ఈ పరాజయంతో గుజరాత్ టైటిల్ ఆశలు ఆవిరయ్యాయి. గుజరాత్ బ్యాటర్లలో ఓపెనర్ డానిల్లే గిబ్సన్ (34), ఫోబ్ లిచ్‌ఫీల్డ్ (31) రాణించినా.. కెప్టెన్ ఆష్లే గార్డ్‌నర్ (8), బెత్ మూనీ (6), హర్లీన్ డియోల్ (8) కీలక మ్యాచ్‌లో పూర్తిగా విఫలమయ్యారు. దీంతో గుజరాత్‌కు భారీ ఓటమి తప్పలేదు.