వామ్మో… మొరం టిప్పర్లు..!

వామ్మో… మొరం టిప్పర్లు..!

– చిట్యాల ప్రధాన రోడ్డుపై దుమ్మురేపుతున్న టిప్పర్ల హవా
– రాత్రింబవళ్లు మొరం రవాణా… ప్రజలకు నరకయాతన
– దుమ్ము దూళితో అనారోగ్య బారిన వ్యాపారులు, ప్రజలు
– అతివేగంతో దూసుకుపోతున్న టిప్పర్లు… ప్రమాద భయం
– నిబంధనలు గాలికొదిలేసిన కాంట్రాక్టర్..
– ప్రమాదం జరిగితే బాధ్యులు ఎవరు..?

చిట్యాల, ఆంధ్రప్రభ : చిట్యాల మండల కేంద్రంలో మొరం టిప్పర్ల హవా రోజురోజుకు పెరుగుతూ ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. నవాబుపేట, కైలాపూర్, శాంతినగర్ శివారులోని గుట్టల్లోని ఎర్రమట్టిని నిబంధనలకు విరుద్ధంగా తవ్వి సదరు కాంట్రాక్టర్ పదుల సంఖ్యలో భారీ టిప్పర్లతో రాత్రింబవళ్లు మొరం రవాణా చేస్తున్నట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. దీంతో నిత్యం రద్దీగా ఉండే చిట్యాల–టేకుమట్ల–మొగుళ్లపల్లి ప్రధాన రహదారి దుమ్ముతో ప్రజలకు నరకయాతనగా మారింది.

భయాందోళనకు గురవుతున్న ప్రజలు, విద్యార్థులు..
భారీ టిప్పర్లు అతివేగంతో దూసుకుపోతుండటంతో రహదారి పై ప్రయాణించే ప్రజలు, విద్యార్థులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. సుమారు పది కిలోమీటర్ల మేర ఈ టిప్పర్ల సంచారం కొనసాగుతుండటంతో రహదారి మొత్తం దుమ్ముతో నిండిపోతోంది. మండల కేంద్రంలోని వ్యాపారుల షాపుల్లోకి దుమ్ము దూళి చేరి వ్యాపారాన్ని దెబ్బతీస్తోందని వారు వాపోతున్నారు. దుమ్ము కారణంగా శ్వాసకోశ సమస్యలు, అలర్జీలు పెరుగుతున్నాయని స్థానికులు చెబుతున్నారు. మండల కేంద్రంలో డిగ్రీ, జూనియర్ కళాశాలలు, పాఠశాలలు ఉండటంతో ప్రతి రోజూ వందలాది మంది విద్యార్థులు రాకపోకలు సాగిస్తుంటారు. ప్రస్తుతం ఇంటర్మీడియట్ పరీక్షల సమయం కావడంతో విద్యార్థుల రద్దీ మరింత పెరిగింది. అంతేకాక వారాంతపు సంత కారణంగా మండల కేంద్రం జనంతో కిక్కిరిసిపోతుంది. ఇలాంటి పరిస్థితుల్లో భారీ టిప్పర్లు రోడ్డు పై వేగంగా దూసుకుపోవడం ప్రమాదాలకు దారి తీసే అవకాశం ఉందని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

నిబంధనలు మరిచారు..
ప్రభుత్వ నిబంధనల ప్రకారం.. గ్రీన్ ఫీల్డ్ కారిడార్ హైవే నిర్మాణ పనుల కోసం తరలించే మట్టిని బైపాస్ రోడ్డు ద్వారా తీసుకెళ్లాల్సి ఉంటుంది. అయితే.. ఆ నిబంధనలను పూర్తిగా పక్కనబెట్టి శాంతినగర్ గుట్ట నుంచి భారీ జేసీబీలతో ఎర్రమట్టిని తవ్వి ప్రధాన రహదారి గుండా టిప్పర్లలో తరలిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో కాంట్రాక్టర్ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాడని మండల ప్రజలు మండిపడుతున్నారు.

ప్రమాదం జరిగితే బాధ్యులు ఎవరు..?
ప్రజల ప్రాణాలను పణంగా పెట్టి మొరం రవాణా కొనసాగుతుండటం పై స్థానికుల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఇప్పటికే రహదారి పై అనేకసార్లు ప్రమాదాలు తృటిలో తప్పించుకున్నాయని స్థానికులు చెబుతున్నారు. ఎప్పుడైనా పెద్ద ప్రమాదం జరిగితే దానికి బాధ్యులు ఎవరు అని మండల ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్, స్థానిక ఎమ్మెల్యే, మైనింగ్, పర్యావరణ, ఆర్ అండ్ బి, అటవీ శాఖ అధికారులు స్పందించి వెంటనే చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. భారీ మొరం టిప్పర్లను ప్రధాన రహదారి గుండా కాకుండా బైపాస్ రోడ్డు ద్వారా మాత్రమే గ్రీన్ ఫీల్డ్ కారిడార్ హైవే పనులకు తరలించేలా కఠిన చర్యలు తీసుకోవాలని మండల ప్రజలు, వ్యాపారులు, విద్యార్థులు కోరుతున్నారు.

నిబంధనలకు విరుద్ధంగా ప్రధాన రోడ్డు పై టిప్పర్లతో మొరం రవాణా,
కోడేల భద్రయ్య టిడిపి నాయకులు చిట్యాల,

గ్రీన్ ఫీల్డ్ కారిడార్ హైవే రోడ్డు నిర్మాణ పనులు నిబంధనల మేరకు మొరం తరలించాలని, అవేం పట్టించుకోకుండా సదర కాంట్రాక్టర్ ప్రధాన రోడ్డు ఆర్ అండ్ బి నుండి భారీ టిప్పర్లతో ఉదయం నుండి సాయంత్రం వరకు మొరం రవాణా చేస్తూ ప్రజలను ఇబ్బందులు పెడుతున్నారని అన్నారు. బైపాస్ రోడ్డు నుండి జరిగే పనులను సదరు కాంట్రాక్టర్ ప్రజలతో నిత్యం రద్దీగా ఉండే చిట్యాల మండల కేంద్రం ప్రధాన ఆర్ అండ్ బి రోడ్డు నుండి వెళ్లడంతో అధిక లడుతో రోడ్డు దెబ్బ తినడంతో పాటు, దుమ్ము దూళితో ప్రజలు అనారోగ్యం బారినపడుతున్నారన్నారు. దీని పర్యవేక్షించవలసిన మైనింగ్, పర్యావరణ, ఫారెస్ట్, ఆర్ అండ్ బి అధికారులు ఏం చేస్తున్నారన్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు జిల్లా కలెక్టర్ స్పందించి సంబంధిత కాంట్రాక్టర్ పై చర్య తీసుకుని, ప్రధాన రహదారి నుండి టిప్పర్లతో మొరం రవాణా నిలిపివేయాలని కోరారు.

భారీ మొరం టిప్పర్లతో ఇబ్బందులు పడుతున్నాం..
తాటిపల్లి శ్రీనివాస్ కిరాణం వ్యాపారి చిట్యాల,

నిత్యం చిట్యాల మండల కేంద్రంలో ఉదయం నుండి సాయంత్రం వరకు మొరం టిప్పర్లు నడవడంతో దుమ్ము ధూళితో తమ షాపుల్లో చేరి అనారోగ్యం పాలవుతున్నామన్నారు. దీంతో పాటు తమ వస్తువుల పై దుమ్ము దులి చేరుతుందన్నారు. నిత్యం రద్దీగా ఉండే ప్రధాన రోడ్డు పై మొరం టిప్పర్లు నడవడంతో, ప్రజలు, విద్యార్థులు, భయాందోళన చెందుతున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి ప్రధాన రోడ్డుపై నుండి టిప్పర్ల రవాణా నిలిపివేయాలని కోరారు.

Leave a Reply