TG | స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల్లో గెలుపే ధ్యేయంగా ప‌నిచేయండి : మ‌ల్లిఖార్జున ఖ‌ర్గే

హైద‌రాబాద్ : రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో మెజారిటీ స్థానాలు గెలుచుకోవడంతో పాటు జూబ్లీహిల్స్ (Jubilee Hills) ఉప ఎన్నికల్లో సత్తా చాటాలని పార్టీ నేతలకు ఏఐసీసీ ప్రెసిడెంట్ మల్లికార్జున ఖర్గే (Mallikarjuna Kharge) పిలుపునిచ్చారు. గాంధీభవన్ లో తెలంగాణ కాంగ్రెస్ పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ సమావేశం జరిగింది. దాదాపు 2 గంటల పాటు సాగిన ఈ సమావేశానికి ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఏఐసీసీ తెలంగాణ వ్యవహారాల ఇన్ చార్జి మీనాక్షి నటరాజన్, పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పీఏసీ సభ్యులు సమావేశంలో పాల్గొన్నారు. సమావేశం ప్రారంభానికి ముందు ఇటీవల సంగారెడ్డి జిల్లా (Sangareddy District) పాశమైలారం పారిశ్రామికవాడలోని సిగాచి పరిశ్రమ పేలుడు ఘటనలో మృతులకు సంతాపం తెలుపుతూ మౌనం పాటించారు.

అనంత‌రం ఖ‌ర్గే మాట్లాడుతూ… నేతల మధ్య విభేదాలుంటే పార్టీలోని చర్చించుకోవాలని బయట మాట్లాడవద్దని హెచ్చరించారు. ప్రతిపక్ష పార్టీలకు అవకాశం ఇవ్వవద్దని సమస్యలుంటే ఇన్ చార్జి నేతలతో కో ఆర్డినేట్ చేసుకోవాలని దిశానిర్దేశం (Direction) చేశారు. ఇక‌ స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ అమలుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు, పార్టీ సంస్థాగత నిర్మాణం, జిల్లాల్లో జరుగుతున్న పార్టీ కార్యక్రమాలు, జై బాపు జై భీమ్ జై సంవిధాన్ కార్యక్రమాలు, సంవిధన్ బచావో కార్యాచరణ ప్రణాళికపై ఈ స‌మావేశంలో చ‌ర్చించారు.

ఖర్గేతో బీసీ నేతల భేటీ:
గాంధీ భవన్ కు వచ్చిన మల్లికార్జున ఖర్గేతో బీసీ సంఘాల నేతలు (BC union leaders) భేటీ అయ్యారు. బీసీ నేత జాజుల శ్రీనివాస్ గౌడ్ నేతృత్వంలో ఖర్గేను కలిసిన బీసీ నేతలు త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల పెంపు, జాతీయస్థాయిలో కులగణన అంశాలు, ఢిల్లీకి అఖిలపక్షం తదితర బీసీ డిమాండ్లను ఖర్గే దృష్టికి తీసుకువెళ్లారు. ఈ మేరకు మల్లికార్జున ఖర్గేకు వినతిపత్రం అందజేశారు.

Leave a Reply