WOMEN | మహిళాభ్యున్నతికి కట్టుబడి ఉన్న ప్రభుత్వం

  • ఆర్థికంగా నిలదొక్కుకునేలా చేస్తాం..
  • ప్రభుత్వ విప్,ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య
  • నందిగామలో డీజీ లక్ష్మీ సెంటర్ ప్రారంభం

WOMEN | నందిగామ, ఆంధ్రప్రభ : మహిళల అభ్యున్నతికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రభుత్వ విప్ నందిగామ శాసన సభ్యురాలు తంగిరాల సౌమ్య పేర్కొన్నారు. పట్టణంలోని గాంధీ సెంటర్‌లో మున్సిపల్ మెప్మా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన డీజీ లక్ష్మీ సెంటర్‌ను సోమవారం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, మహిళల ఆర్థిక అభివృద్ధికి స్వయం ఉపాధి అవకాశాల విస్తరణకు మెప్మా చేపడుతున్న కార్యక్రమాలు ఎంతో ఉపయోగకరమని పేర్కొన్నారు. డీజీ లక్ష్మీ సెంటర్ ద్వారా మహిళలకు నైపుణ్యాభివృద్ధి, స్వయం ఉపాధి శిక్షణలు, ఆర్థిక సాయం, వనరుల సమన్వయం వంటి సేవలు అందుబాటులోకి రావడం అభినందనీయమని వెల్లడించారు. మహిళలు శ్రమిస్తే కుటుంబం అభివృద్ధి చెందుతుందని, కుటుంబం అభివృద్ధి చెందితే సమాజం అభివృద్ధి దిశగా పయనిస్తుందని తంగిరాల సౌమ్య తెలియజేశారు.

నందిగామలో మహిళలకి మరిన్ని అవకాశాలు, మరిన్ని ప్రోత్సాహక పథకాలు అందించే దిశగా ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు. స్థానిక మహిళలకు ఈ సెంటర్ ఎంతో ఉపయోగపడుతుందని, నైపుణ్యాలు పెంపొందించుకునేందుకు ఇది ఒక వేదికగా మారుతుందన్నారు. అనంతరం ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య సెంటర్‌లో అందుబాటులో ఉన్న సదుపాయాలను పరిశీలించారు. కార్యక్రమంలో చైర్ పర్సన్ మండవ కృష్ణకుమారి,కూటమినేతలు మున్సిపల్ అధికారులు, మెప్మా ప్రాజెక్టు సిబ్బంది, మహిళా సంఘాల సభ్యులు పాల్గొన్నారు.

Leave a Reply