శిథిలాల కింద చిక్కుకున్న మహిళ
నారాయణపేట ప్రతినిధి, ఆంధ్రప్రభ : తుఫాన్ ప్రభావంతో కురుస్తున్న వర్షాలకు ఇల్లు కూలిపోవడంతో మహిళ తీవ్రంగా గాయపడ్డారు. హజికన్‌పేట (Hajikanpet ) లో నిన్న రాత్రి వర్షం పడడంతో ఇంటి గోడ కూలిపోవడంతో శిథిలాల కింద చింతామణి అనే గృహిణి చిక్కుకుంది. తల భాగం మాత్రమే బయటకు కనిపించడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు.
ఈ విషయాన్ని టౌన్ ఎస్సై వెంకటేశ్వర్లుకు తెలియజేశారు. దీంతో పోలీసు సిబ్బంది (Police personnel) తో తక్షణమే సంఘటనా స్థలానికి చేరుకుని, స్థానిక యువకుల సహాయంతో సుమారు అరగంటపాటు శ్రమించి మహిళను సురక్షితంగా బయటకు తీశారు. అనంతరం పోలీసు వాహనంలో ఆమెను నారాయణపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమెకు ప్రాణాపాయం లేదని వైద్యులు చెప్పడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.

