WGL | మా గోస పట్టించుకోండంటూ.. తహశీల్దార్ కాళ్లు పట్టుకున్న మహిళా రైతు

నర్సింహులపేట, మే28(ఆంధ్రప్రభ) : మా గోస పట్టించుకోండి సారూ.. అంటూ మహిళా రైతులు తహశీల్దార్ కాళ్లు పట్టుకుని వేడుకున్న సంఘటన మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండల కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి కొనుగోలు కేంద్రంలో బుధవారం జరిగింది. గత నెల రోజులుగా పిఎసిస్ఎస్ కొనుగోలు కేంద్రంలో ధాన్యం పోశామని కాంటాలు కావడం లేదని… ధాన్యం కొనుగోలు చేయడం లేదని… తమ గోస ఎవరూ పట్టించుకున్న పాపాన పోవడం లేదని, మండలంలోని పిచ్చిరామ్ తండాకు చెందిన భూక్య గోరి, భూక్య ఈరీలు ఆందోళన చేయడంతో విషయం తెలుసుకుని సంఘటనా స్థలానికి చేరుకున్న తహశీల్డార్ రమేష్ బాబు వచ్చి మాట్లాడుతుండగా మహిళ రైతులు కాళ్లు పట్టుకొని మా ధాన్యాన్ని తరలించాలని వేడుకున్నారు.

జోక్యం చేసుకొని ఆయన సర్ది చెప్పారు. కొన్ని రోజులు అయితే మళ్లీ నారు పోయాలని యేసంగి ధాన్యమే కొనకపోతే వానకాలం ఎలా సాగు చేస్తామంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తూ.. ధాన్యాన్ని తరలించాలని కోరుతున్నారు. తడిసిన ధాన్యాన్ని కూడా ప్రభుత్వమే కొనుగోలు చేయాలని కెవిపిఎస్ జిల్లా సహాయ కార్యదర్శి మందుల యాకుబ్ ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేస్తూ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

Leave a Reply