మేడిపల్లి, మార్చి 13 (ఆంధ్రప్రభ) : మద్యానికి అలవాటు పడిన భర్త నిత్యం వేధించడంతో ఆ వేధింపులు భరించలేక భర్తను గొడ్డలితో నరికి చంపిన ఘటన జగిత్యాల జిల్లా మేడిపల్లి మండలం కొండాపూర్ గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామస్తులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… కొండాపూర్ గ్రామానికి చెందిన తాలూకా రాజన్న (55), గత కొంతకాలంగా మద్యానికి అలవాటు పడి తన భార్య లక్ష్మితో గొడవ పడుతుండేవాడు.
ఈక్రమంలో నెలరోజుల క్రితం తన భార్యతో గొడవపడి ఆమెను కొట్టగా ఆమె తలకు చేయికి తీవ్ర గాయాలయ్యాయి. గత రాత్రి సమయంలో మృతుడు తాలూకా రాజన్న కొండాపూర్ గ్రామంలోని తన ఇంట్లో నిద్రిస్తుండగా.. భార్య తాలూకా లక్ష్మీ భర్త ప్రతిరోజూ తాగి వేధిస్తుండగా ఆ వేధింపులు భరించలేక నిద్రిస్తున్న భర్త మెడపై గొడ్డలితో నరికి చంపింది. మృతుడి చెల్లెలు సంఘ శారద ఫిర్యాదు మేరకు ఎస్సై శ్యాంరాజ్ కేసు నమోదు చేయగా, కోరుట్ల సీఐ బి.సురేష్ బాబు దర్యాప్తు చేస్తున్నారు. మృతుడికి ఇద్దరు కొడుకులు, ఒక కూతురు సంతానం. పెద్ద కొడుకు, కూతురికి వివాహాలు అయ్యాయి. చిన్న కొడుకు ప్రస్తుతం గల్ఫ్ దేశంలో ఉన్నాడు.