రాజన్న ఆలయ అభివృద్ధి పనులపై ఎవ‌రు కోర్టుకు వెళ్లినా…

రాజన్న ఆలయ అభివృద్ధి పనులపై ఎవ‌రు కోర్టుకు వెళ్లినా…

హైద‌రాబాద్‌, ఆంధ్ర‌ప్ర‌భ : వేములవాడ శ్రీ రాజరాజేశ్వరస్వామి(Sri Rajarajeswara Swamy) ఆలయ అభివృద్ధి పనులు చట్టబద్ధంగా, భక్తుల సౌకర్యార్థం జరుగుతున్నాయని తెలుపుతూ, ఎవరు ఈ పనులను అడ్డుకునేందుకు కోర్టును ఆశ్రయించినా ముందుగా తమ వాదనలు వినిపించే అవకాశం కల్పించాలన్న అభ్యర్థనతో హైకోర్టులో కేవియట్ పిటిషన్(Caveat Petition) దాఖలు చేయబడింది.

ఈ కేవియట్ పిటిషన్‌ను వోజ్జల వంశీ కృష్ణ(Vojjala Vamsi Krishna) దాఖలు చేయగా, ఆయన తరఫున హైకోర్టు న్యాయవాది తీగల రామ్ ప్రసాద్ వ్యవహరిస్తున్నారు. వేములవాడ రాజన్న ఆలయం అభివృద్ధి, పునరుద్ధరణ కార్యక్రమాలు ఎండౌమెంట్స్(Endowments) శాఖ పర్యవేక్షణలో జరుగుతున్నాయని, ఇవి ఆలయ విస్తరణ, సౌకర్యాల పెంపు, భక్తుల సౌలభ్యం దృష్ట్యా అవసరమని వంశీ కృష్ణ తెలిపారు. ఆలయ పునరుద్ధరణ సమయంలో ఉత్సవ మూర్తులను శ్రీ భీమేశ్వరస్వామి ఆలయానికి తాత్కాలికంగా తరలించడం ఆగమ శాస్త్ర పరంగా సముచితమేనని, ఈ నిర్ణయం భక్తుల విశ్వాసాన్ని కాపాడే దిశగా ఉందని ఆయన పేర్కొన్నారు.

“కొంతమంది భక్తులను తప్పుదోవ పట్టిస్తూ అభివృద్ధి పనులను అడ్డుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. భక్తుల శ్రేయస్సు కోసం జరుగుతున్న ఈ పనులు సాఫీగా కొనసాగడానికి మేము కేవియట్ పిటిషన్ దాఖలు చేశాం. ఎవరైనా వ్యతిరేకంగా కోర్టు(Court)కు వెళితే, మాకు వినిపించే అవకాశం లభించాలని మాత్రమే మా ఉద్దేశం.” అని తెలిపారు. ఈ కేవియట్ పిటిషన్ దాఖలుతో, భవిష్యత్తులో ఎవరు ఆలయ అభివృద్ధి పనులను సవాలు చేస్తూ పిటిషన్ వేస్తే, కోర్టు ముందుగా వోజ్జల వంశీ కృష్ణకు నోటీసు జారీ చేసి, ఆయన వాదనలు విన్న తరువాతే ఎటువంటి ఉత్తర్వులు జారీ చేయవలసి ఉంటుంది.

Leave a Reply