చేవెళ్ల ప్రమాదానికి సవాలక్ష కారణాలు !
చేవెళ్ల, ఆంధ్రప్రభ : చేవెళ్ల దుర్ఘటనకు బాధులెవరు అనేది ప్రస్తుతం చర్చనీయాంశం. ప్రమాదం జరిగినప్పుడు డ్రైవర్ నిర్లక్ష్యం.. అతి వేగం అనేది తొలుత చర్చకు వస్తాయి. అలాగే చేవెళ్లలో నిన్న జరిగిన బస్సు-టిప్పర్ ఢీకొన్న దుర్ఘటనలో 19 మంది మృతి చెందిన సంగతి తెలిసిందే.
ఇందుకు ప్రత్యక్ష బాధ్యులు టిప్పర్ డ్రైవర్ అనేది వాస్తవం. కానీ ప్రమాదం జరిగిన తీరు పరిశీలిస్తే అనేక కారణాలు కూడా కనిపిస్తున్నాయి. ఈ రోజు దుర్ఘటన ప్రదేశాన్ని పరిశీలించిన డీజీపీ శివధర్ రెడ్డి ప్రమాదానికి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని ప్రకటించారు.
అయితే ఈ ప్రమాదానికి బాధ్యులు ఎవరు అనేది ప్రస్తుతం ఉన్న ప్రశ్న. దుర్మరణం పాలైన డ్రైవర్లా? నిబంధనలు పాటించికపోయినా పర్యవేక్షించని శాఖలా? అనేది ప్రజల నుంచి వస్తున్న ప్రశ్నలు. ఆర్టీసీ, మైనింగ్, పోలీసు, ట్రాన్స్‌పోర్టు బాధ్యతారాహిత్యం వల్లే ఇలాంటి ప్రమాదాలకు కారణమని పలువురు అభిప్రాయపడుతున్నారు.
బస్సును టిప్పర్ ఢీకొన్న వెంటనే టిప్పర్‌లో ఉన్న కంకర ప్రయాణికులపై పడింది. కంకర పడడంతోనే మృతులు సంఖ్య పెరిగిందనడంలో సందేహం లేదు. దీనికి తోడు బస్సులో కూడా పరిమితికి మంచి ప్రయాణికులు ఉన్నారు. ఇది కూడా ప్రమాద తీవ్రతకు ఒక కారణం.
టిప్పర్ విషయానికి వస్తే…
ప్రమాదానికి కారణమైన టిప్పర్ నిబంధనలు పాటించలేదు. సాధారణంగా టిప్పర్‌కు 30 టన్నులు లోడు వేసుకునే కెపాసిటీ. కానీ ఈ టిప్పర్‌లో 60 టన్నుల కంకరా వేశారు. డబుల్ బరువు గల కంకరా వేయడంతో వాహనం అదుపు చేయడం కష్టం. ఈ క్రమంలోనే రోడ్డు మధ్యలో ఉన్న చిన్నపాటి లోతును తప్పించి ఎదరుగా ఉన్న గుంతను తప్పించబోయిన డ్రైవర్ టిప్పర్‌ను అదుపు చేయలేక బస్సును ఢీకొన్నాడు.
బస్సు ఢీకొన్న వెనువెంటనే కంకరా ప్రయాణికులపై ఒక్కసారిగా పడిపోయింది. ఒకవేళ టార్పాలిన్ ఉండి ఉంటే కంకరా పడే అవకాశం తక్కువ. లేదా నెమ్మదిగా కంకరా పడి ఉండేది. ఈలోగా ప్రయాణికులు ప్రమాదం నుంచి బయట పడే అవకాశాలు ఉంటాయి. అలాగే సాధారణంగా ఉదయం నాలుగు గంటల నుంచి ఉదయం ఏడు గంటల మధ్య ఎక్కువగా ప్రమాదాలు జరుగుతుంటాయి.
సాధారణంగా ట్రిప్పులు, టన్నుల లెక్క ప్రకారం కిరాయి ఇస్తారు. అందుకే అధికంగా ట్రిప్పులు వేయాలన్న ఉద్దేశంతోపాటు పరిమితికి మించి లోడు వేస్తుంటారు. ఈ క్రమంలోనే ప్రమాదాలు ఎక్కువగా జరుగుతుంటాయి. అదే చేవెళ్ల లాంటి ఘటనకు ప్రధాన కారణం.
ఇక బస్సు విషయాని వస్తే..
ఆర్టీసీకి అద్దె ప్రాతిపదికన బస్సు తిప్పుతున్నారు. బస్సులో 55 మంది ప్రయాణించడానికి అనుమతి ఉంది. అంటే దీని కెపాసిటీ 55 మంది ప్రయాణికులు. ప్రమాద సమయానికి బస్సులో 75 మంది ప్రయాణికులు ఉన్నారు. అంటే అదనంగా మరో 20 మంది ఉన్నారు.
ఒక బస్సు కెపాసిటీ కంటే 20 మంది అధికంగా ఉన్నారంటే కాళ్లు కదపడానికి కూడా అవకాశం లేదు. అందుకే కంకర పడినప్పుడు ప్రయాణికులు తప్పించుకోలేకపోయారు.
మృతుల సంఖ్య పెరగడానికి ఇదొక కారణం. బస్సుల ఫ్రీక్వెన్సీని తగ్గించారు. ఒకప్పుడు ఆక్యుపెన్సీ ప్రకారం బస్సుల సంఖ్య పెంచేవారు. కానీ ఇప్పుడు ఆర్టీసీ అలా చేయడం లేదు. దీనివల్ల కూడా బస్సులోకి పరిమితికి మించి ప్రయాణికులు ఎక్కుతున్నారు.
ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని…
హైదరాబాద్-బాజీపూర్ రోడ్డుకు జాతీయ రహదారి హోదా వచ్చినప్పటి నుంచి విస్తరణ కాలేదు. నాలుగేళ్ల కాలంలో ఈ రహదారిపై వందల సంఖ్యలో ప్రమాదాలు జరిగాయి. ఈ రోడ్డుపై ప్రయాణం చేయాలంటే ప్రాణాలు అరచేతిలో పెట్టుకోవాల్సిందే. రోడ్డును విస్తరించేందుకు అడ్డుగా ఉన్న మర్రి వృక్షాలను తొలగించాలి. మర్రి వృక్షాలను కాపాడాలని పర్యావరణవేత్తల న్యాయపోరాటానికి దిగారు.
చెన్నై కోర్టులో జాతీయ హరిత ట్రిబ్యూనల్(ఎన్‌జీటీ)ను ఆశ్రయించి 2021లో కేసు వేశారు. ఈ కేసులో మర్రి వృక్షాలను తాకరాదని పేర్కొంటూ ఎన్‌జీటీ మధ్యంతర ఉత్తర్వులను జారీ చేసింది. దీంతో రోడ్డు విస్తరణ పనులు ఆగిపోయాయి. బస్సు దుర్ఘటన జరిగిన రోజున తుది తీర్పు వచ్చింది.
ఈ మార్గంలో ఉన్న మొత్తం 915 మర్రి వృక్షాలలో 765 వృక్షాలను అలాగే ఉంచి విస్తరణ పనులను చేపడుతామని ఎన్‌హెచ్‌ఏఐ నిర్ణయించింది. నిన్న ఎన్‌జీటీ తుది తీర్పును వెలవరించింది. రోడ్డు విస్తరణకు సుగమం అయింది.
పర్యవేక్షణ లోపం..
అధికారులు పర్యవేక్ష చేయకపోవడమే ప్రమాదాలకు కారణమవుతున్నాయి పలువురు అభిప్రాయపడుతున్నారు. సాధారణంగా తెల్లవారు జామున నాలుగు గంటల నుంచి ఏడు గంటల వరకూ ఎక్కువగా ప్రమాదాలు జరుగుతున్నాయి. నిన్న చేవెళ్ల మండలంలో జరిగిన ప్రమాదం కూడా ఈ కోవలోకి వస్తుంది.
ఇక్కడ పోలీసు, మైనింగ్, ట్రాన్స్‌ఫోర్టు డిపార్టుమెంట్లు నిఘా కొరవడింది. రాత్రులు డ్యూటీలో ఉన్న కొందరు డ్రైవర్లు తెల్లవారు జామున మద్యం తీసుకుంటారు. అర్ధరాత్రి వరకూ డ్రంక్ అండ్ డ్రైవ్‌పై నిఘా వేసిన పోలీసులు తెల్లవారు జామున నిఘా వేయడం మానేస్తున్నట్లు సమాచారం.
దీనివల్ల డ్రైవర్లు తెల్లవారు జామున మద్యం తాగి డ్రైవింగ్ చేస్తున్నారు. అలాగే నిబంధనలు పాటిస్తున్నారో కూడా పరిశీలించడం లేదు. తెలంగాణలో మైనింగ్‌కు అనుమతులు లేవు. కానీ మైనింగ్ రవాణా జరుగుతోంది. ఎప్పుడు పోలీసులు పట్టుకుంటారో అనే భయంతో మైనింగ్ తరలించే వాహనాలు స్పీడ్‌గా తీసుకెళుతుంటారు.
ఇంతా జరుగుతున్నా మైనింగ్ శాఖ మాత్రం నిద్ర లేవలేదు. ట్రాన్స్‌పోర్టు.. శాఖపరంగా ఆదాయం మాత్రమే చూసుకుంటున్నారు తప్పా ప్రత్యేకంగా దాడులు చేయడం లేదు. పరిమితికి మించి లోడు తీసుకెళుతున్న టిప్పర్లపై గానీ, ఆర్టీసీ బస్సులపై దాడులు చేయడం లేదు. ఈ మూడు శాఖల దాడులు పెరిగితే ప్రమాదాలు తగ్గే అవకాశం ఉంది.

