ఈ కాలం ఎప్పుడు మొదలైంది?
కోటానుకోట్ల నక్షత్ర మండలాలు, ఒక్కొక్క నక్షత్రం చుట్టూ పరిభ్రమించే గ్రహాలు, మధ్యన కృష్ణ బిలాలు.. ఇలా ఊహించుకుంటూ పోతే మనసు ఆనందంతో పాటు అద్భుత అనుభవానికి గురవుతుంది.
ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఈ బ్రహ్మాండమైన విన్యాసాన్ని ఆలోచించే మెదడునిచ్చిన సృష్టికర్త ఎక్కడున్నాడని అన్వేషించడం.
అయితే విలువైన కాలమును ఎంత వరకు సద్వినియోగం చేసుకుంటున్నాము? అనేది ఒక గొప్ప ప్రశ్న. ముఖ్యంగా యువతీ యువకులు పాశ్చాత్య పోకడలకు పోయి విలువైన జీవితాలను నాశనం చేసుకుంటున్నారు.
డబ్బు, విలాసం, సంపదల వ్యామోహం వలలో పడి విలువైన మానవ సంబంధాలను తుంగలో తొక్కుతున్నారు. పవిత్రమైన హైందవ వివాహ వ్యవస్థను అపహాస్యం చేస్తున్నారు. కుటుంబ వ్యవస్థను చిన్నాభిన్నం చేసుకుంటున్నారు. చివరికి తమ తమ ఆరోగ్యాలను ఫణంగా పెట్టి ఆయుష్షును కుదించుకుంటున్నారు.
మానవ జీవితమే అతి స్వల్పం. సగం నిద్రకు, మిగిలిన దానిలో సగం కాల కృత్యాలకు, బాహ్య దేహ పోషణకు, మిగిలిన కాలమంతా ఏది పోగొట్టుకుంటామోనని భయంతో కరిగి పోతుంది. దీనికి తోడు అసూయ ద్వేషాలతో నిత్యం మనసు-దేహం రగిలి పోతూ ఉంటుంది. ఇక దేవుడు, పూజ, సంస్కారం మొదలైనవి మృగ్యంగా మారుతున్నాయి.
కాలస్వరూపమైన పరమాత్మ దివ్యత్వాన్ని తెలుసుకోలేక పోతున్నాము. అదేమిటి? నిత్యం దేవాలయాలు, తీర్థాలు భక్తులతో నిండిపోతున్నాయి కదా అని మనం అనుకోవచ్చు. కానీ భౌతికమైన తీరని కోరికల కోసం బారులు తీరుతున్నారు వీరంతా. తీర్థయాత్రలు అంటే విహార యాత్రలు అనుకుంటున్నారు మరి కొందరు.
దీనికి అనేకమైన కారణాలు ఆక్రమించి ఉన్నాయి దినచర్యలో దైవారాధన చాలా ముఖ్యం. ఆరాధన అంటే మొక్కుబడిగా కాదు, అసలు ఈ మానవ జన్మకు కారణం ఏమిటి? నేనెవరు?? ఈ భూమి మీదకు ఎక్కడి నుంచి వచ్చాను?? తిరిగి ఎక్కడికి వెళ్తాము?? ఈ అనంత విశ్వంతో పోల్చితే నివసించే భూమి పరిమాణం ఎంత? భూమితో పోల్చితే మన పరిమాణం ఎంత? ఈ కాలం ఎప్పుడు మొదలైంది? దీనికి అంతం ఉందా? ఆనందం అంటే ఏమిటి? ఏది శాశ్వతం? మొదలైన ప్రశ్నలు ఆరాధనలో భాగంగా చేసుకొని మౌనంగా అన్వేషణ చేయాలి. ఆడంబరాల ప్రాధాన్యత తగ్గించుకుని, కనీస సౌఖ్యంతో జీవన యాత్ర సాధించాలి. ఆకలితో అలమటించే పరిస్థితిని రూపుమాపాలి. మనకి లభించిన ఈ అతి స్వల్ప జన్మ కాలాన్ని సంస్కారయుతంగా వినియోగించాలి. క్లిష్టమైన ఈ జన్మ రహస్యాన్ని తెలుసుకోవాలంటే కాలం అనే ఆ భగవంతునికే సాధ్యం. రాత్రివేళ ఆకాశంలో మనకు అనేక నక్షత్రాలు కనిపిస్తాయి సూర్యోదయం అయ్యాక అవి కనపడవు అంతమాత్రాన ఆకాశంలో నక్షత్రాలు లేవనా?? అలాగే భగవంతుని మనం కనుగొన లేక పోయినంత మాత్రాన ఆయన లేడని కాదు కదా?? అనే శ్రీరామకృష్ణ పరమహంస బోధ నిజం.
-వారణాశి వెంకట సూర్య కామేశ్వరరావు