‘ఆపరేషన్ వజ్ర ప్రహార్’ అంటే..

‘ఆపరేషన్ వజ్ర ప్రహార్’ అంటే..
శ్రీ సత్యసాయి బ్యూరో, ఆంధ్రప్రభ : శ్రీ సత్యసాయి జిల్లా వ్యాప్తంగా మాదకద్రవ్యాల నియంత్రణ లక్ష్యంగా పోలీసులు “ఆపరేషన్ వజ్ర ప్రహార్” పేరుతో భారీ స్థాయిలో కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. జిల్లా ఎస్పీ ఎస్. సతీష్ కుమార్ ఆదేశాల మేరకు ఆదివారం తెల్లవారుజాము నుంచే అన్ని సబ్ డివిజన్లలో ఈ తనిఖీలు కొనసాగాయి. రాష్ట్ర స్థాయిలో డీజీపీ హరీష్ కుమార్ గుప్తా మార్గదర్శకత్వంలో, ఈగల్ ఐజీ ఏకే రవి కృష్ణ ఐపీఎస్ పర్యవేక్షణలో ఈ ప్రత్యేక ఆపరేషన్ చేపట్టబడింది. జిల్లాలోని కదిరి, పెనుకొండ, పుట్టపర్తి సబ్ డివిజన్ల పరిధిలోని హాట్ స్పాట్ ప్రాంతాల్లో పోలీసులు విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు.
ఎక్కడెక్కడ తనిఖీలు..?
పోలీసులు ముఖ్యంగా : మాదకద్రవ్యాల వినియోగం అనుమానం ఉన్న ప్రాంతాలు, అద్దె ఇళ్లు, లాడ్జీలు, ఖాళీ భవనాలు, బస్ స్టాండ్లు, రైల్వే స్టేషన్లు, రౌడీ షీటర్లు, పాత నేరస్థుల నివాసాలు తదితర ప్రదేశాల్లో సోదాలు నిర్వహించారు. డ్రోన్ కెమెరాల సహాయంతో కూడా నిఘా కొనసాగించారు.
ముఖ్య ఫలితాలు..
రికార్డులు సరిగా లేని 109 టూ వీలర్లు స్వాధీనం చేసుకున్నారు. 20 మంది రౌడీషీటర్లకు కౌన్సెలింగ్ ఇచ్చారు. గంజాయి, నాటు సారా విక్రేతల పై ప్రత్యేక నిఘా పెట్టారు. అనుమానాస్పద వ్యక్తుల గురించి విచారణ చేశారు.
ప్రజల్లో అవగాహన..
ఈ సందర్భంగా పోలీసులు మాదకద్రవ్యాల వల్ల కలిగే ఆరోగ్య, సామాజిక, చట్టపరమైన ప్రమాదాల పై ప్రజలకు అవగాహన కల్పించారు. డ్రగ్స్ వినియోగం యువత భవిష్యత్తును దెబ్బతీస్తుందని హెచ్చరించారు.
ప్రజలకు పిలుపు..
ప్రజలు తమ పరిసరాల్లో గంజాయి లేదా ఇతర మత్తు పదార్థాల పై సమాచారం ఉంటే ఏపీ ఈగల్ టోల్ ఫ్రీ నెంబర్ 1972 కు తెలియజేయాలని సూచించారు. సమాచారం ఇచ్చే వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని పోలీసులు హామీ ఇచ్చారు.
ప్రతిజ్ఞ కార్యక్రమం..
పోలీసులు, ప్రజలు కలిసి “ఆపరేషన్ వజ్ర ప్రహార్ ప్రతిజ్ఞ” చేపట్టి డ్రగ్స్ రహిత సమాజం కోసం కలిసి పని చేయాలని సంకల్పించారు.
ఎస్పీ వ్యాఖ్య..
జిల్లా ఎస్పీ ఎస్. సతీష్ కుమార్ మాట్లాడుతూ.. మాదకద్రవ్యాల వినియోగం, అక్రమ రవాణా పూర్తిగా అరికట్టడమే ఈ కార్యక్రమం లక్ష్యమని తెలిపారు. “ఆపరేషన్ వజ్ర ప్రహార్” కింద ఇలాంటి ప్రత్యేక దాడులు నిరంతరం కొనసాగుతాయని స్పష్టం చేశారు. ప్రజల సహకారంతో డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం సాధ్యమని ఆయన పేర్కొన్నారు.

