- చికిత్స ముసుగులో మోసగాళ్ల చాకచక్యం
- ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యం ఆరోపిస్తూ బంధువుల ఆందోళన
వరంగల్, (ఆంధ్రప్రభ సిటీబ్యూరో): వరంగల్‌లోని ఆరేపల్లి సమీప రిలీఫ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగి బంగారు ఆభరణాలు అదృశ్యమైన ఘటన కలకలం రేపింది. ములుగు జిల్లా లక్ష్మీదేవిపల్లి గ్రామానికి చెందిన రమాదేవి పక్షవాతం కారణంగా మంగళవారం ఆసుపత్రిలో చేరగా, బుధవారం స్కానింగ్ కోసం తరలించిన సమయంలో ఈ సంఘటన జరిగింది.
స్కానింగ్‌కు ముందు శరీరంపై బంగారు ఆభరణాలు ఉండకూడదని రేడియాలజీ విభాగం సిబ్బంది మెడలోని బంగారు పుస్తెలతాడు, చైను తొలగించి తీసుకున్నారు. స్కానింగ్ ముగిసిన తర్వాత రమాదేవిని వార్డుకు తీసుకెళ్లారు. అయితే ఆభరణాలు తిరిగి ఇవ్వలేదు.
వార్డులోకి వచ్చిన రోగిని చూసిన కుటుంబ సభ్యులు ఆభరణాల గురించి అడగగా, “సిబ్బంది తీసేశారు, తిరిగి ఇచ్చలేదు” అని రమాదేవి తెలిపారు. దీంతో కుటుంబ సభ్యులు ఆసుపత్రి సిబ్బందిని నిలదీశారు. సిబ్బంది స్పష్టమైన సమాధానం ఇవ్వలేకపోవడంతో హాస్పిటల్‌లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
ఆరోపణలను ఖండించిన ఆసుపత్రి సిబ్బంది, “మేమేమీ ఆభరణాలు తీసుకోలేదు” అంటూ ప్రతివాదానికి దిగారు. యాజమాన్యం తమపై దౌర్జన్యంగా వ్యవహరిస్తోందని రోగి బంధువులు ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలించారు. రేడియాలజీ విభాగంలోకి వెళ్లే ముందు రమాదేవి ఒంటిపై నగలు ఉన్నట్లు పోలీసులు నిర్ధారించారు. అయితే ఆ తర్వాత నగలు ఎక్కడికి మాయమయ్యాయో స్పష్టత రాలేదు.
కుటుంబ సభ్యులు హాస్పిటల్‌పై దబాయింపులు చేస్తున్నట్లు ఆరోపిస్తూ ఆందోళన చేపట్టగా, తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు కూడా చేశారు.

