విద్యతోనే సామాజిక మార్పు సాధ్యం…

విద్యతోనే సామాజిక మార్పు సాధ్యం…

జ్యోతిరావు పూలే ద్విశతాబ్ది ఉత్సవాల్లో బీఎస్పీ పిలుపు

కదిరి రూరల్, ఆంధ్రప్రభ : భారతదేశంలోని అట్టడుగు వర్గాల అభ్యున్నతి కోసం జీవితాంతం పోరాడిన మహనీయుడు మహాత్మా జ్యోతిరావు పూలే అని బీఎస్పీ జిల్లా ప్రధాన కార్యదర్శి, కదిరి నియోజకవర్గ ఇంచార్జ్ వై. రామచంద్ర ప్రసాద్ పేర్కొన్నారు. మహాత్మా జ్యోతిరావు పూలే ద్విశతాబ్ది జయంతి ఉత్సవాలను శనివారం కదిరి రూరల్ ప్రాంతంలో బీఎస్పీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పూలే విగ్రహానికి పూలమాలలు వేసి నాయకులు, కార్యకర్తలు ఘనంగా నివాళులర్పించారు.

ఈ సందర్భంగా నిర్వహించిన సభలో వై. రామచంద్ర ప్రసాద్ మాట్లాడుతూ, దేశంలో అణగారిన వర్గాలు నిత్యం పీడనకు గురై కష్టసాధ్యమైన జీవనాన్ని కొనసాగించాల్సిన పరిస్థితులకు సామాజిక అసమానతలే ప్రధాన కారణమని అన్నారు. విద్య ద్వారానే బహుజన వర్గాల్లో చైతన్యం పెరిగి, సమాజంలో నిజమైన మార్పు సాధ్యమవుతుందని ఆయన స్పష్టం చేశారు. మహాత్మా జ్యోతిరావు పూలే చూపిన మార్గం నేటికీ సమాజానికి దిక్సూచిగా నిలుస్తోందని కొనియాడారు.

రాష్ట్రంలో కొన్ని కులాలు, కేంద్రంలో మరికొన్ని ఆధిపత్య వర్గాలు అధికారాన్ని కేంద్రీకరించుకుని ప్రజల జీవన విధానంపై ప్రభావం చూపుతున్నాయని ఆయన విమర్శించారు. ముఖ్యంగా బడుగు, బలహీన వర్గాలు, నిమ్నజాతులు ఇతరుల చేతిలో పావులుగా మారకుండా తమ హక్కుల కోసం ఐక్యంగా పోరాడాల్సిన అవసరం ఉందన్నారు. సామాజికంగా అణచివేతకు గురవుతున్న వర్గాలకు న్యాయం జరగాల్సిన సమయంలో వివిధ విధానాలు వారి పురోగతికి అడ్డంకిగా మారుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.

అలాగే ఎన్నికల సమయంలో బీసీ రక్షణ చట్టం, బీసీ డిక్లరేషన్, అలాగే 50 ఏళ్లు నిండిన ఎస్సీ, ఎస్టీ, బీసీలకు పెన్షన్ సదుపాయం కల్పిస్తామని ఇచ్చిన హామీలు ఇప్పటికీ అమలు కాలేదని ఆయన ఆరోపించారు. హామీలు ఇచ్చిన ప్రభుత్వాలు వాటి అమలుపై చిత్తశుద్ధి చూపడం లేదని తీవ్రంగా దుయ్యబట్టారు. బహుజన వర్గాల సమస్యల పరిష్కారానికి ఎస్సీ, ఎస్టీ, బీసీలు ఐక్యంగా ముందుకు రావాలని పిలుపునిచ్చారు.

జ్యోతిరావు పూలే ఆశయాలు సామాజిక న్యాయం, సమానత్వం, విద్యా ప్రాధాన్యతలపై ఆధారపడి ఉన్నాయని, నేటి తరానికి ఆయన జీవితం ఆదర్శమని నాయకులు పేర్కొన్నారు. విద్య ద్వారా మాత్రమే సామాజిక చైతన్యం పెంపొందించి సమాన హక్కుల సాధన సాధ్యమవుతుందని సభలో పలువురు వక్తలు అభిప్రాయపడ్డారు.

సభకు ముందు పట్టణంలో బీఎస్పీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో పార్టీ జెండాలు, ఫ్లకార్డులతో కార్యకర్తలు పాల్గొని జ్యోతిరావు పూలే ఆశయాలను ప్రజలకు చాటి చెప్పారు. అనంతరం పూలే విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఏ. గోవిందు, జిల్లా నాయకులు, స్థానిక ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, పెద్ద సంఖ్యలో బహుజన వర్గాల ప్రజలు పాల్గొన్నారు.

Leave a Reply