వైద్య కళాశాలల ప్రైవేటీకరణను సహించం
- మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు హెచ్చరిక
శ్రీకాకుళం, ఆంధ్రప్రభ బ్యూరో : మెడికల్ కాలేజీ(Medical College)ల ప్రైవేటీకరణను అడ్డుకుని తీరుతామని మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు స్పష్టం చేశారు. శ్రీకాకుళం(Srikakulam)లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. విద్య, వైద్య రంగాలను ప్రైవేటు యాజమాన్యాల కిందకు తీసుకువెళ్లి విద్యార్ధులు, పేదల జీవితాలతో చెలగాటం ఆడేందుకు కూటమి సర్కారు తీసుకున్న నిర్ణయాలను ప్రజా పోరాటంతోనే అడ్డుకుంటామన్నారు.
బాధ్యతారహితంగా ఈ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై సర్కార్(Government) మెడలు వంచి, దానిని ఉపసంహరించుకునే వరకు వెనకడుగు వేయబోమని పేర్కొన్నారు. ప్రజారోగ్యాన్ని బలిపీఠం మీద పెడితే బాధ్యతయుతమైన ప్రతిపక్షంగా సహించేది లేదని అన్నారు. ప్రజల ఆరోగ్యం ప్రభుత్వ బాధ్యతగా భావించాలి కానీ చంద్రబాబు(Chandrababu) నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం రాజ్యాంగ విరుద్ధంగా మెడికల్ కాలేజీలను ప్రైవేటుపరం చేసి నాణ్యమైన వైద్యం పొందే పేదవాడి హక్కును కాలరాసిందని మండిపడ్డారు.
గత వైయస్సార్సీపీ(YSRCP) ప్రభుత్వ హయాంలో ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి విలయతాండవం చేసినా రాష్ట్రంలోని వైయస్ జగన్(YS Jagan) నేతృత్వంలో సమర్థవంతంగా ఎదుర్కొని ప్రజల ప్రాణాలను కాపాడగలిగామని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం వైద్యం పట్ల ప్రజల్లో భరోసా కల్పించలేకపోతోందని, ఇప్పుడు కరోనా లాంటి విపత్తు ఎదురైతే ప్రాణాలతో ఉంటామన్న ఆశ నేడు ప్రజల్లో సన్నగిల్లిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆరోగ్యశ్రీ పథకాన్నికూడా కూటమి ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని ఆగ్రహించారు.