జన్నారం, జూన్ 4(ఆంధ్రప్రభ) : పల్లెల్లో తిరిగి పేదవారికి విడతల వారీగా ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తామని ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ అన్నారు. మంచిర్యాల జిల్లా జన్నారం మండలంలోని ఎంపీడీవో సమావేశమాల్లో మంజూరైన ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల పత్రాలను బుధవారం ఆయన అందజేశారు. ఆ తర్వాత పొనకల్ సింగిల్ విండో కార్యాలయంలో జీలుగా, మేలు రకమైన వడ్ల విత్తనాలను ఆయన పంపిణీ చేశారు.
ఈసందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ… ఇందిరమ్మ ఇండ్లలో అవకతవకలకు పాల్పడితే సహించేది లేదన్నారు. మొదటి విడతగా నిరుపేదలకు ఇండ్లు మంజూరు చేశామని, గ్రామాల్లోని అర్హులంతా అధైర్య పడకూడదని, తమ ప్రభుత్వం ఇండ్లు లేని అర్హులందరికీ తప్పకుండా ఇందిరమ్మ ఇండ్లు ఇస్తామని ఆయన తెలిపారు. ప్రజలంతా తన వెంట ఉంటే అభివృద్ధికి ఆటంకం కలుగజేస్తున్న అటవీశాఖ చెక్ పోస్ట్ లను తొలగించడానికి వెనుకాడబోనని ఆయన స్పష్టం చేశారు. ఇందిరమ్మ ఇళ్ళను వీలైనంత తొందరగా కట్టుకున్న లబ్ధిదారులను సన్మానించనున్నట్లు ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో మండల ప్రత్యేక అధికారి జనార్ధన్, ఎంపీడీవో హుమర్ షరీఫ్, జన్నారం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ దుర్గం లక్ష్మీనారాయణ, వైస్ చైర్మన్ సయ్యద్ ఫసిహుల్ల, పోనకల్ సింగల్ విండో చైర్మన్ అల్లం రవి, తదితరులు పాల్గొన్నారు.