WBC | భారత మహిళల సత్తా…

లివర్‌పూల్‌: ప్రపంచ బాక్సింగ్‌ ఛాంపియన్‌షిప్‌ (డబ్ల్యూబీసీ) – 2025 లో భారత మహిళా బాక్సర్లు అద్భుత ప్రతిభ చూపారు. తొలిసారిగా నాలుగు పతకాలను కైవసం చేసుకుంటూ చరిత్ర సృష్టించారు.

57 కేజీల విభాగంలో జైస్మిన్‌ లంబోరియా తనదైన శైలిలో ఆడుతూ భారత్‌కు తొలి స్వర్ణం అందించగా, 48 కేజీల విభాగంలో మీనాక్షి హుడా మరో గోల్డ్‌ను గెలిచి మెరిసింది. అంతేకాదు, 80 ప్లస్‌ కేజీల విభాగంలో నుపుర్‌ షెరోన్‌ రజతం, 80 కేజీల విభాగంలో పూజా రాణి కాంస్యం సాధించి భారత పతకాల ఖాతాను నింపారు.

జైస్మిన్‌ చరిత్ర …
ఆదివారం జరిగిన 57 కేజీల ఫైనల్లో 24 ఏళ్ల జైస్మిన్‌ పోలాండ్‌ ఒలింపిక్‌ సిల్వర్‌ మెడలిస్ట్‌ జూలియా సెరెమెటాపై 4-1 తేడాతో గెలిచి స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకుంది. వరల్డ్‌ బాక్సింగ్‌ ఛాంపియన్‌షిప్‌లో భారత్‌కు గోల్డ్‌ తెచ్చిన తొలి మహిళా బాక్సర్‌గా చరిత్రలో నిలిచింది. నూతన గ్లోబల్‌ గవర్నింగ్‌ బాడీగా ఏర్పడిన వరల్డ్‌ బాక్సింగ్‌ ఆధ్వర్యంలో జరిగిన మొదటి టోర్నమెంట్‌ ఇదే కావడం విశేషం.

మహిళల విభాగంలో మేరీ కోమ్‌ ఆరు సార్లు, నిఖత్‌ జరీన్‌ రెండు సార్లు (2022, 2023) బంగారు పతకాలు గెలిచిన సంగతి తెలిసిందే. అయితే ఈసారి నిఖత్‌ క్వార్టర్‌ ఫైనల్లోనే ఓటమి పాలైంది.

మీనాక్షి, నుపుర్‌, పూజా మెరుపులు..

48 కేజీల ఫైనల్లో మీనాక్షి హుడా 4-1 తేడాతో కజకిస్తాన్‌కి చెందిన పారిస్‌ ఒలింపిక్‌ బ్రాంజ్‌ మెడలిస్ట్‌ నాజిమ్‌ కైజైబేను ఓడించి మరో పసిడి కైవసం చేసుకుంది.

80 ప్లస్‌ కేజీల ఫైనల్లో నుపుర్‌ షెరోన్‌ 2-3 తేడాతో అగాటా కాజ్‌మార్‌స్కాపై పోరాడి తృటిలో ఓడిపోవడంతో రజతంతో సరిపెట్టుకుంది.
80 కేజీల విభాగంలో పూజా రాణి సెమీఫైనల్లో ఇంగ్లండ్‌ బాక్సర్‌ ఎమిలీ ఆస్క్విత్‌ చేతిలో 1-4 తేడాతో ఓడి కాంస్యం సాధించింది.

పురుషుల విభాగంలో నిరాశ..

మహిళల విభాగంలో నాలుగు పతకాలతో భారత్‌ మెరిసినప్పటికీ, పురుషుల జట్టు మాత్రం ఖాళీ చేతులతోనే వెనుదిరిగింది. 50 కేజీల కాంస్య పోరులో జడుమణి సింగ్‌ మాండెంగ్‌బాం 0-4 తేడాతో కజకిస్తాన్‌ ప్రపంచ ఛాంపియన్‌ సంటర్‌ టష్కెన్‌బాయ్‌ చేతిలో చిత్తుగా ఓడిపోయాడు. 2013 తర్వాత భారత పురుషుల జట్టు వరల్డ్‌ బాక్సింగ్‌లో మెడల్‌ లేకుండా మిగిలిపోవడం ఇదే తొలిసారి.

Leave a Reply