KNL | ప్రాజెక్టులకు వెంటనే నీటిని విడుదల చేయాలి : బొజ్జా దశరథరామిరెడ్డి

కర్నూలు బ్యూరో, జూలై 1, ఆంధ్రప్రభ : తుంగభద్ర ఎగువ కాలువ, దిగువ కాలువలకు నీటి విడుదల చేయకుండా తుంగభద్ర డ్యాం నుండి నదిలోకి నీటిని విడుదల చేస్తున్నారని… జూన్ 22నాటికే శ్రీశైలం రిజర్వాయర్ నీటిమట్టం 854అడుగులకు చేరినా రాయలసీమ ప్రాజెక్టులకు నీటి విడుదల చేయని ప్రభుత్వం తీరుపై రాయలసీమ సాగునీటి సాధన సమితి అధ్యక్షులు బొజ్జా దశరథరామిరెడ్డి తీవ్ర అసంతృప్తి వ్యక్తపరిచారు.

మంగళవారం నంద్యాల సమితి కార్యాలయంలో ఆయ‌న‌ మాట్లాడుతూ… సాధారణంగా రావలసిన రుతు పవనాల కంటే సుమారు 15 రోజులు ముందుగా రాయలసీమలో రుతుపవనాలు ప్రవేశించడంతో గత మే నెలలో వర్షాలు రాయలసీమలో విస్తారంగా కురవడంతో రైతుల్లో ఆశలు చిగురించి కేసీ కెనాల్, తెలుగుగంగ, ఎస్ఆర్ బీసీ, ఎల్ఎల్సి ఆయకట్టు కింద లక్ష ఎకరాలకు పైగా పొలాల్లో పత్తి, మొక్కజొన్న, సోయాబీన్, మినుము, కంది, వేరుశనగ తదితర ఆరుతడి పంటలను రైతులు సాగు చేశార‌న్నారు.

శ్రీశైలం రిజర్వాయర్ నీటిమట్టం 869.73 అడుగులు చేరినా రాయలసీమ ప్రాజెక్టులకు నీటి విడుదలకు ముందుకు రాని ప్రభుత్వం విద్యుత్ ఉత్పత్తి పేరుతో రిజర్వాయర్ నుంచి దిగువకు నీటి విడుదల చేయడం పట్ల రాయలసీమ పట్ల పాలకుల నిర్లక్ష్య వైఖరికి అద్దం పడుతోందని ఘాటుగా విమర్శించారు. దుర్భిక్ష వాతావరణం నేపథ్యంలో ఎండిపోతున్న పంటలను కాపాడటానికి, శ్రీశైలం రిజర్వాయర్, తుంగభద్ర డ్యామ్ నుండి రాయలసీమలోని వివిధ రిజర్వాయర్లకు, ప్రాజెక్టులకు తక్షణమే విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

నీటి విడుదలలో రాయలసీమ పట్ల ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికి నిరసనగా జూలై 2న‌ రాయలసీమ ప్రజాసంఘాలు, అఖిలపక్ష పార్టీల నాయకుల ఆద్వర్యంలో కర్నూలు జలవనరుల శాఖ కార్యాలయం దగ్గర ధర్నా కార్యక్రమం నిర్వహిస్తున్నామని బొజ్జా ప్రకటించారు. ఈ కార్యక్రమంలో రాయలసీమ ప్రజా సంఘాలు, అన్ని రాజకీయ పార్టీలు పాల్గొని రాయలసీమ రైతాంగానికి బాసటగా నిలబడాలని బొజ్జా విజ్ఞప్తి చేశారు.

Leave a Reply