Water Problem | అభివృద్ధి హామీలతో అర్రేం సాంబయ్య…
- గ్రామాభివృద్ధి పథకాలతో ప్రజల్లోకి
- అభివృద్దే ధ్యేయం గా హామీలతో
- గెలిస్తే అమలుచేస్తానని ప్రతీనా
- ప్రచారంలో దూసుకెళ్తున్న తీరు అభినందనీయం
- 13 అంశాలతో ప్రజల్లోకి
- గెలిపించాలని విజ్ఞప్తి
Water Problem | నల్లబెల్లి, ఆంధ్రప్రభ : మేడపల్లి గ్రామ సర్పంచ్ పదవికి బి.ఆర్.ఎస్. పార్టీ తరపున అర్రెం సాంబయ్య బరిలో నిలుస్తున్నట్లు ప్రకటించారు. గ్రామాభివృద్ధికి సంబంధించిన 13 అంశాలతో కూడిన సమగ్ర ప్రణాళికను ప్రజల ముందుంచి తను విజయం సాధించిన ఒక నెల నుండి గ్రామ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఆయన స్పష్టం చేశారు. గ్రామంలో కోతుల బెడద నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకోవడమే కాకుండా, డ్రైనేజీ కాలువల నిర్మాణానికి కేంద్ర, రాష్ట్ర నిధులను వినియోగిస్తానని తెలిపారు. స్వచ్ఛంద సంస్థలతో కలిసి తాగునీటి సమస్య పరిష్కారంపై దృష్టి సారించనున్నట్లు తెలిపారు.
ప్రతి వీధిలో వీధి దీపాలు సక్రమంగా వెలిగేలా పర్యవేక్షణ చేపట్టి, ప్రధాన కూడళ్లలో సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు. వ్యవసాయాభివృద్ధిపై ప్రత్యేక శ్రద్ధతో పాకాల ప్రాజెక్టు కాలువపై కొత్త చెక్‌డ్యాంల నిర్మాణానికి ప్రాధాన్యత ఇస్తానన్నారు. బతుకమ్మ, వినాయక చవితి పండుగల సందర్భంగా చెరువుల వద్ద ఘాట్‌లను అభివృద్ధి చేస్తానని ప్రకటించారు. పెద్దమ్మ తల్లి ఆలయ మార్గంలో సిసి రోడ్డు నిర్మాణం రెండేళ్లలో పూర్తి చేయనున్నట్లు తెలిపారు. మహిళల గౌరవార్థం ప్రతి సంక్రాంతికి ముగ్గు పోటీలు నిర్వహిస్తానని, గ్రామ రక్షణ కోసం సిసి కెమెరాలను ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు.
అనుసంధాన రోడ్ల నిర్మాణం, ఐటిడిఎ నిధులతో బోర్లు, బావులు తవ్వడంలో సహకరిస్తానని వివరించారు. అలాగే గ్రామంలో వ్యాయామ కేంద్రం, గ్రంథాలయ స్థాపనపై దృష్టి సారిస్తానని చెప్పారు. తల్లిదండ్రులు కోల్పోయిన అనాధ పిల్లలను ఆశ్రమ పాఠశాలల్లో చేర్పించేందుకు ప్రత్యక్ష పర్యవేక్షణ చేస్తానని హామీ ఇచ్చారు. “నేను మీ అన్న, తమ్ముడిగా, ఎలాంటి స్వార్థం లేకుండా ప్రజల సేవకు అంకితభావంతో పనిచేస్తాను’’అని అర్రెం సాంబయ్య తెలిపారు.

