- ఉపరాష్ట్రపతికి కేంద్రమంత్రి..
- ఎంపీ ప్రత్యేక ఆహ్వానం
- ఆహ్వాన పత్రిక అందజేత
ఆంధ్రప్రభ, ఎన్టీఆర్ బ్యూరో : విజయవాడ నగర పర్యాటక, సాంస్కృతి, చారిత్రక, అధ్యాత్మిక వైభవాన్ని దేశ వ్యాప్తంగా చాటి చెప్పేందుకు నిర్వహిస్తున్న విజయవాడ ఉత్సవ్ కు ఉపరాష్ట్రపతి సీపీ రాధ కృష్ణన్ ను కేంద్ర విమానాయన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు, ఎంపీ హరీష్ బాలయోగి, రాజ్య సభ్య ఎంపీ సానా సతీష్ లతో కలిసి విజయవాడ ఉత్సవ్ కమిటీ సభ్యులు, ఎంపీ కేశినేని శివనాథ్ ఆహ్వానించారు.
ఉపరాష్ట్రపతి సీపీ రాధ కృష్ణన్ ను శనివారం ఢిల్లీలోని ఆయన నివాసంలో కలిసి విజయవాడ ఉత్సవ్ ఆహ్వాన పత్రిక అందజేశారు. ఉపరాష్ట్రపతి సీపీ రాధకృష్ణన్ కు పుష్పగుచ్ఛం అందించి శాలువాతో ఎంపీ కేశినేని శివనాథ్ సత్కరించారు. విజయవాడ ఉత్సవ్ కి రావాలని ఎంపీ కేశినేని శివనాథ్ ప్రత్యేకంగా ఉపరాష్ట్రపతి సీపీ రాధకృష్ణన్ ను ఆహ్వానించారు.
ఉప రాష్ట్రపతి సీపీ రాధకృష్ణన్ కు రాష్ట్ర పర్యాటక శాఖ సహకారంతో, సొసైటీ ఫర్ వైబ్రెంట్ విజయవాడ ఆధ్వర్యంలో విజయవాడ ఉత్సవ్ మహోత్సవం జరుగుతోందని ఎంపీ కేశినేని శివనాథ్ వివరించారు. విజయవాడ సాంస్కృతిక విలువలను ప్రోత్సహిస్తూ, స్థానిక సంప్రదాయాల వైభవాన్ని దేశవ్యాప్తంగా పరిచయం చేయడం ఈ ఉత్సవ లక్ష్యమని వివరించారు.
సమాజంలోని ప్రతి వర్గాన్నీ కలుపుకుంటూ ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించనున్నట్లు తెలిపారు..ఆంధ్ర రాష్ట్ర సాంస్కృతిక సంప్రదాయాల ప్రతీకగా నిలిచే విజయవాడ ఉత్సవ్ కార్యక్రమానికి తప్పనిసరిగా వస్తానని ఉపరాష్ట్రపతి సీపీ రాధకృష్ణన్ చెప్పినట్లు ఎంపీ కేశినేని శివనాథ్ వెల్లడించారు.

