పల్లెల్లో అంతర్మథనం
- పంచాయతా?.. పరిషతా?
- పార్టీ టికెట్ ఇస్తుందో? లేదో?
- ఒక వేళ టికెట్ రాకపోతే పరిస్థితి ఏమిటి?
- గ్రామాల్లో పార్టీ పరిస్థితి ఏమిటో?
- ప్రాదేశికాలకు, పంచాయతీలకు మధ్య మారనున్న సమీకరణాలు
- ఏక కాలం ఎన్నికలే ఏకగ్రీవాలకు అడ్డు
ఆంధ్రప్రభ పొలిటికల్ వెబ్ డెస్క్ : తెలంగాణలో పంచాయతీ, పరిషత్(Panchayat, Parishad) ఎన్నికలు ఏక కాలంలో జరగడంతో గ్రామీణ ప్రాంత నాయకులు సందిగ్ధంలో పడ్డారు. ఏకకాలంలో జరిగే ఎన్నికలతో రాజకీయ సమీకరణాలు మారుతాయి. దీని ప్రభావం విజయావకాశాలపై పడుతుంది. దీంతో గ్రామీణ ప్రాంత నాయకులు అంతర్మథనం చెందుతున్నారు.
ఒకే నెలలో ఈ రెండు ఎన్నికలకు రాష్ట్ర ఎన్నిక సంఘం షెడ్యూల్(Schedule) విడుదల చేసింది. రాష్ట్రంలో 31 జిల్లాల్లోని 565 మండలాల్లో 5,719 ఎంపీటీసీ, 565 జడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు నిర్వహిస్తున్నారు. రాష్ట్రంలో 12,733 పంచాయతీలు, 112,288 వార్డుల్లో ఎన్నికలు జరుగుతాయి. పరిషత్ ఎన్నికలు రెండు విడతల్లో, సర్పంచ్ ఎన్నికలు మూడు విడతల్లో నిర్వహణకు ఎన్నికల సంఘం నిర్ణయించింది. ఈ నెలలోనే నామినేషన్లు(Nominations) దాఖలు గడువు కూడా నిర్ణయించారు.
స్థానిక ఎన్నికల్లో అన్ని పార్టీలు నిమగ్నమయ్యాయి. మండల పరిషత్ ఎన్నికలు పార్టీ పరంగా, పంచాయతీ ఎన్నికలు పార్టీలకతీతంగా జరుగుతాయి. ఏకకాలంలో ఎన్నికలు జరుగుతుండడంతో కొందరి విజయావకాశాలు తారుమారయ్యే అవకాశాలు లేకపోలేదు. అలాగే ఏకగ్రీవమయ్యే పంచాయతీ సంఖ్య కూడా తగ్గే అవకాశం ఉంటుందని పలువురు పరిశీలకులు భావిస్తున్నారు. అలాగే మండల పరిషత్‌కు పోటీ చేసిన అభ్యర్థులకు పంచాయతీల్లో పోటీ చేసే అవకాశం కూడా కోల్పోతున్నారు. దీంతో ఇటు పరిషత్‌కు పోటీ చేయాలా? అటు పంచాయతీకి పోటీ చేయాలా? అనే సందిగ్ధత కొంత మంది నాయకుల్లో ఉంది.
మారనున్నసమీకరణాలు
ఎంపీటీసీ(MPTC) అభ్యర్థిగా పోటీ చేసే నేతకు, సర్పంచ్ పదవికి పోటీ చేసే నేతకు మధ్య రాజకీయ సమీకరణాలు వ్యత్యాసం ఉంటుంది. అయితే ఏక కాలంలో పంచాయతీ, పరిషత్ ఎన్నికలు జరగడంతో ఈ సమీకరణాలు మారుతుంటాయి. అసెంబ్లీ, లోక్‌సభ(Assembly, Lok Sabha) ఎన్నికలకు స్థానిక సంస్థలకు జరిగే ఎన్నికలకు చాలా తేడా ఉంటుంది. దేశ, రాష్ట్ర రాజకీయ పరిస్థితులకు అనుగుణంగా ప్రజలు ఓట్లు వేస్తారు.
పంచాయతీ, పరిషత్ ఎన్నికల మధ్య చాలా వ్యత్యాసం కూడా ఉంటుంది. పంచాయతీ పూర్తిగా వ్యక్తిగతం, గ్రామంలో నాయకుడి బలాబలాలపై విజయావకాశాలు ఆధారపడి ఉంటాయి. పరిషత్ ఎన్నికలు గ్రామంలో నాయకుడి బలాబలాలతోపాటు పార్టీ మద్దతు కూడా అవసరం ఉంటుంది. అయితే పరిషత్‌కు పోటీ చేస్తే పార్టీ టికెట్ ఇస్తుందా? ఒకవేళ ఇవ్వకపోతే పరిస్థితి ఏమిటి? అనేది కూడా నాయకుల్లో ఉంది. అలాగే మన పార్టీ(Party)కి క్షేత్రస్థాయిలో బలం ఎంత ఉంది ? అనేది కూడా అంచనాలు వేసుకుంటున్నారు.
ప్రధానంగా వివిధ పార్టీ నాయకులు అనేక మంది గ్రామీణ ప్రాంతాల నుంచి పుట్టుకొచ్చిన వారే! వారంతా తమ గ్రామాల్లో బలం నిరూపించుకోవడం కోసం స్థానిక సంస్థల ఎన్నికలను వేదికగా చేసుకుంటారు. అలాంటప్పుడు ఎవరి సమీకరణాలు వారు చేసుకుంటారు. సర్పంచ్ ఎన్నికల్లో గ్రామ పరిస్థితులను బట్టి ఒక పార్టీ నేతకు వేరొక పార్టీ నేత కూడా మద్దతు ఇచ్చే అవకాశం ఉంటుంది. ఏక కాలంలో పంచాయతీ, పరిషత్ జరగడం వల్ల సర్పంచ్ పదవి కోసం గ్రామీణ ప్రాంతాల్లో జరిగే సమీకరణాలు మారిపోతాయి.
దీని ప్రభావం ప్రాదేశిక నియోజకవర్గంలో పార్టీలపై ప్రభావం చూపుతుంది. ఈ రెండు ఎన్నికలు ఒకేసారి జరగడంతో ఒకే పార్టీ నుంచి పోటీ చేసిన ఎంపీటీసీ అభ్యర్థి, పంచాయతీ సర్పంచ్ ఎవరి విజయానికి వారు ప్రయత్నం చేస్తారు. అలాంటప్పుడు వారి మధ్య సమీకరణాలు(Elections) మారే అవకాశం కూడా లేకపోలేదు. ఇదే విజయావకాశాలను తారుమారు చేస్తోంది.
ఏక కాలం ఎన్నికలే ఏకగ్రీవాలకు అడ్డు
సాధారణంగా పంచాయతీ సర్పంచ్ పదవి కోసం జరిగే ఎన్నికల్లో ఏకగ్రీవాలు ఎక్కువగా జరుగుతాయి. గతంలో పరిషత్ ఎన్నికలకు, పంచాయతీ ఎన్నికలకు మధ్య కొన్ని నెలలు గ్యాప్ ఉండేది. ఈ సారి రెండు ఎన్నికలు ఏక కాలంగా జరగడంతో ఏకగ్రీవాలకు అడ్డుగా ఉంటుందని పలువురు పరిశీలకులు భావిస్తున్నారు. సాధారణంగా పార్టీలకు అతీతంగా గ్రామంలో ఏకగీవ్రాలు జరుగుతుంటాయి. గ్రామంలో మంచి నాయకుడు, మోతుబరి నాయకుడు, డబ్బులు ఉన్ననాయకుడు ఇలా చాలా మంది సర్పంచ్ పదవులకు పోటీ పడుతుంటారు.
అయితే అక్కడ ఎవరికి బలం ఎక్కువగా ఉంటే వారు ఏకగ్రీవం(Unanimity) చేసుకోవడం ఆనవాయితీ. ఇలాంటి సందర్భాల్లో ప్రత్యర్థి పార్టీ వారు కూడా వ్యతిరేకించరు. అలాంటప్పుడు ఏకగ్రీవ పంచాయతీలు ఎక్కువగా ఉంటాయి. ఏక కాలంలో ఎన్నికలు జరిగినప్పుడు సమీకరణాలు మారిపోతాయి. ఎంపీటీసీ అభ్యర్థికి మద్దతు ఇస్తే సర్పంచ్ పదవి ఏకగ్రీవం చేస్తామన్న మెలిక పెడితే ఎవరు పార్టీని వారు కాపాడుకుంటారు. ఇదే ఏకగ్రీవాలకు అడ్డు కలుగుతుంది.