విజయవాడ ఉత్సవ్ మాకు స్ఫూర్తి

  • భీమవరంలోనూ నాలుగు రోజుల ఈవెంట్
  • మైసూర్ ను మరిపించారు
  • కలకత్తా గుర్తు చేశారు
  • తక్కువ సమయంలో భారీ ఏర్పాట్లు….
  • ఎంపీ కేశినేని శివనాథ్ స్పూర్తిదాయకం
  • కేంద్రమంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ….

ఆంధ్రప్రభ, ఎన్టీఆర్ బ్యూరో : రాజకీయ చైతన్యానికి పుట్టినిల్లు విజయవాడ అని, ప్రస్తుత విజయవాడ ఉత్సవ్ తో నేడు మరోసారి ప్రపంచ గుర్తింపు లభించిందని కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతి రాజు శ్రీనివాస వర్మ పేర్కొన్నారు. విజయవాడ పార్లమెంటు సభ్యుడు కేసినేని శివనాద్ ఆధ్వర్యంలో జరుగుతున్న విజయవాడ ఉత్సవ్ లో భాగంగా మంగళవారం విజయవాడలోని పున్నమి ఘాట్లో జరిగిన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విజయవాడ చరిత్రకు అద్భుతమైన గట్టానికి తెరదీసిన వ్యక్తి ఎంపీ కేశినేని శివనాథ్ అని ప్రశంసించారు. విజయవాడకు గొప్ప చరిత్ర ఉంది. కృష్ణమ్మ చెంత వెలసిన అమ్మవారితో పాటు దేశంలో రాజకీయ చైతన్యం కలిగిన ప్రాంతంగా ఈ నగరానికి ప్రత్యేక గుర్తింపు ఉందణి, నవరాత్రుల సందర్భంలో ఇక్కడి అమ్మవారి సాక్షిగా ఇలాంటి ఉత్సవాలు ఇప్పటివరకు జరగకపోవడం ఆశ్చర్యకరం అన్నారు.

దసరా సందర్భంగా మైసూరు, కలకత్తా ఉత్సవాలను చూసేందుకు ప్రజలు దేశం నలుమూలల నుంచి వెళ్తారణి, ఇకపై విజ‌యవాడ కూడా ఆ స్థాయిలో ఉత్సవాలకు వేదిక కావాలణి ఆయన ఆకాంక్షించారు. ఎంపీ కేశినేని శివనాథ్‌ చొరవతో సొసైటీ ఫర్ వైబ్రెంట్ సంస్థ రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో నిర్వహిస్తున్న ఈ ఉత్సవం నగర చరిత్రలో మరొక మైలురాయిగా నిలుస్తుందని అభినందించారు. మన సంస్కృతి, సంప్రదాయాలు, కళలను భవిష్యత్తు తరాలకు అందించేందుకు ఇలాంటి వేడుకలు ఎంతో అవసరం అని చాలా తక్కువ సమయంలో ఇంత పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసిన ఎంపీ కేశినేని శివనాథ్‌ను ప్రత్యేకంగా అభినందించారు.

రాబోయే సంవత్సరాల్లో విజ‌యవాడ ఉత్సవం మరింత అద్భుతంగా జరుగుతుందణి, ఎంపీ కేశినేని నాకు కూడా స్పూర్తి అని, ఆయన సూచనతో రాబోయే సంక్రాంతికి మా జిల్లాలో సంప్రదాయ పద్దతిలో నాలుగు రోజుల పాటు ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహిస్తానని ప్రకటించారు. విజ‌యవాడ–అమరావతి ప్రాంతం పెద్ద ఎత్తున అభివృద్ధి చెందబోతోందని, కేంద్ర ప్రభుత్వం విస్తృతంగా నిధులు సమకూరుస్తోందని ఆయన స్పష్టం చేశారు.

అక్టోబర్ 2న మూడు వేల మంది కళాకారులు పాల్గొనే ప్రదర్శన గురించి ఎంపీ కేశినేని చెప్పినప్పుడు నాకు గర్వంగా అనిపించిందని మంత్రి అన్నారు.ఈ సందర్భంగా ఎంపీ శివనాథ్ మాట్లాడుతూ విజయవాడకు ఉన్న చారిత్రక, సాంస్కృతిక, ఆధ్యాత్మిక వైభవాన్ని విజయవాడ ఉత్సవ్ వంటి వేదికల ద్వారా దేశం మొత్తం ఎదుట ప్రదర్శించాలన్నది తన లక్ష్యంగా తెలిపారు . మన నగరం కేవలం వాణిజ్య, వ్యాపార కేంద్రం మాత్రమే కాకుండా, కళలు, సంస్కృతి, ఆధ్యాత్మికత కలిసిన కేంద్రమని ప్రతి ఒక్కరికి తెలియాలన్నారు.

ఈ వేదికల ద్వారా స్థానిక కళాకారులకు అవకాశం కల్పించడం, యువత ప్రతిభను వెలికితీయడం ఈ ఉత్సవాల ప్రధాన ఉద్దేశం. విజయవాడను జాతీయ, అంతర్జాతీయ సాంస్కృతిక పటంలో నిలపడానికి ఇలాంటి ఉత్సవాలు భవిష్యత్తులో మరింత విస్తృత స్థాయిలో నిర్వహిస్తామని తెలిపారు. పూర్తి సహాయ సహకారాలు అందిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం, స్థానిక అధికారులు, కమిటీ సభ్యులకు కృతజ్ఞతలు తెలియజేశారు. “విజయవాడ ప్రజలు ఎప్పుడూ ఆతిథ్యభావంతో ముందుంటారని, మనందరం కలిసి విజయవాడ బ్రాండ్ ఇమేజ్‌ను మరింత ఎత్తుకు తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి కేడీసీసీ బ్యాంకు అధ్యక్షుడు నెట్టెం రఘురాం, మాజీ ఎమ్మెల్సీ బుద్ధ వెంకన్న, స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ చైర్మన్ కామారెడ్డి పట్టాభిరామ్ ఇతర రాజకీయ సినీ రంగ ప్రముఖులు పాల్గొన్నారు.

Leave a Reply