ఉపాధి రంగాన్ని శాసిస్తోన్న కెమిస్ట్రీ …

ఉపాధి రంగాన్ని శాసిస్తోన్న కెమిస్ట్రీ …
పీబీ.సిద్ధార్థలో ఐసీటీ ప్రొఫెసర్ డా.రాంబాబు
విజయవాడ, ఆంధ్రప్రభ : సుప్రామాలిక్యులర్ కెమిస్ట్రీలో భాగమైన క్రిస్టల్ ఇంజనీరింగ్ ఎంతగానో ప్రభావం చూపుతూ ఫార్మా, పెట్రో, ఫోరెన్సిక్, ఫుడ్, హెల్త్ కేర్ రంగాల అవసరాలను తీరుస్తోందని ఇనిస్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ (ముంబయి) ఆచార్యులు డాక్టర్ డి. రాంబాబు అన్నారు. సోమవారం విజయవాడ పర్వతనేని బ్రహ్మయ్య సిద్ధార్థ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల కెమిస్ట్రీ విభాగం సెమినార్ హాలులో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ… రసాయనశాస్త్రంలో పరిజ్ఞానం పెంచుకునేవారికి బోధన, పరిశోధన రంగాల్లో ఉపాధి అవకాశాలు అపారంగా ఉన్నాయన్నారు.
ఔషధ పరిశ్రమ, ఎరువుల తయారీ, ఫుడ్ ఇండస్ట్రీ, పర్యావరణ పరిరక్షణ వంటి విభాగాలను క్రిస్టల్ ఇంజనీరింగ్ ప్రభావితం చేస్తోందన్నారు. ప్రత్యేకమైన పరిస్థితుల్లో ఔషధాల ప్రాథమిక రసాయన నిర్మాణాన్ని మార్చకుండా, వాటి స్పటిక నిర్మాణాన్ని మార్చడంలో క్రిస్టల్ ఇంజనీరింగ్ కీలకపాత్ర పోషిస్తోందన్నారు. ఈ సందర్భంగా వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ ఎం. మనోరంజని, సహాయచార్యులు డేవిడ్ రాజు డాక్టర్ రాంబాబును ఘనంగా సత్కరించారు.
