Vijayawada | నూతన కౌలుచట్టం తీసుకురావాలి

Vijayawada | నూతన కౌలుచట్టం తీసుకురావాలి
Vijayawada | విజయవాడ, ఆంధ్రప్రభ : ఎన్నికల హామీ మేరకు నూతన కౌలు చట్టం తీసుకొచ్చి కౌలురైతులకు రక్షణ, వారి సంక్షేమానికి చర్యలు చేపట్టాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. విజయవాడలోని సంఘ కార్యాలయం దాసరి భవన్ లో ఆంధ్రప్రదేశ్ కౌలురైతుల సంఘం రాష్ట్ర నాయకులు దొంతా కృష్ణ అధ్యక్షతన జరిగిన రాష్ట్ర సమితి సమావేశానికి ముఖ్య అతిథిగా ఆయన హాజరై ప్రసంగించారు. ఈ సందర్భంగా ఈశ్వరయ్య మాట్లాడుతూ… మారిన పరిస్థితుల్లో వ్యవసాయ రంగంలో కీలకమైన భూమికను పోషిస్తున్న కౌలురైతుల పట్ల రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదన్నారు. ఎన్నికల ముందు కౌలురైతుల సంక్షేమానికి చేసిన వాగ్దానాలు గద్దెనెక్కిన తర్వాత విస్మరించడం దుర్మార్గమన్నారు.
వ్యవసాయ సంక్షోభం కారణంగా ఆత్మహత్యలు చేసుకున్న రైతాంగ కుటుంబాలకు ఎక్స్ గ్రేషియో చెల్లించటానికి బడ్జెట్లో నిధులు కేటాయించకపోవడం ఇంతకన్నా దౌర్భాగ్యం మరొకటి లేదన్నారు. పోరాడితేనే కౌలురైతుల సమస్యలు పరిష్కారం అవుతాయని, కౌలురైతులు చేస్తున్న న్యాయమైన పోరాటానికి భారత కమ్యూనిస్టు పార్టీ మద్దతు ఉంటుందన్నారు. ఆంధ్రప్రదేశ్ రైతుసంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.వి.వి ప్రసాద్ మాట్లాడుతూ ఆరుగాలం శ్రమించి పంటలు పండిస్తున్న కౌలరైతుల రక్షణకు ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం బాధాకరమన్నారు.

ఉదారంగా కౌలురైతులకు పంట రుణాలు జారీ చేయాలని, కౌలు రైతులకు తీసుకున్న రుణాలకు వడ్డీ రాయితీ కల్పించాలని డిమాండ్ చేశారు. కౌలురైతులు ఎదుర్కొంటున్న పలు సమస్యలపై తీర్మానాలు చేసిందని ఆ తీర్మానాలను ఆంధ్రప్రదేశ్ కౌలు రైతుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి.జమలయ్య పత్రికలకు తెలియజేశారు. ఎన్నికల సందర్భంగా భూమిలేని కౌలు రైతులందరికీ అన్నదాత సుఖీభవ పథకం అమలు చేస్తామని హామీ ఇచ్చి ఈ రెండేళ్లలో ఒక పైసా కూడా ఇవ్వకుండా మోసం చేసిందని, తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం కౌలురైతులకు అన్నదాత సుఖీభవ పథకాన్ని అమలు చేయాలని డిమాండ్ చేసిందన్నారు.

భూ యజమాని ప్రమేయం లేకుండానే కౌలురైతులకు గుర్తింపు కార్డులు జారీ చేయాలని, భూ యజమాని బ్యాంకు బకాయిలతో సంబంధం లేకుండానే పంట రుణాలు అందించాలని విజ్ఞప్తి చేసిందన్నారు. ఉచిత పంటల బీమా పథకాన్ని తిరిగి పునరుద్ధరించాలని ఇన్పుట్ సబ్సిడీ, పంటల భీమా పరిహారం కౌలురైతులకే చెల్లించాలని, పెరుగుతున్నకౌలు రేట్లు నియంత్రించడానికి చట్టం తీసుకురావాలని డిమాండ్ చేసిందన్నారు.

కౌలురైతుల డిమాండ్లు సాధన కోసం ఆంధ్రప్రదేశ్ రైతు సంఘంతో కలిపి ఫిబ్రవరి 23వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండల కేంద్రాల్లో ఆందోళన నిర్వహించాలని పిలుపునిచ్చిందన్నారు. ఏప్రిల్ మొదటి వారం నుండి కౌలు రైతులకు సులభతరంగా గుర్తింపు కార్డులు జారీ చేయాలని కోరుతూ మార్చి 18వ తేదీన జిల్లా కలెక్టర్ ఆఫీసుల వద్ద ఆందోళన నిర్వహించాలని నిర్ణయించిందని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే నూతన చట్టం తీసుకురాకపోతే రాష్ట్ర వ్యాప్తంగా కౌలురైతులను సమీకరించి చలో సెక్రటేరియట్ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చిరించిందని పి.జమలయ్య చెప్పారు.
