Vijayawada | ఉద్యోగుల సమస్యలను శాసనసభలో ప్రస్తావించండి..

Vijayawada | ఉద్యోగుల సమస్యలను శాసనసభలో ప్రస్తావించండి..

శాసనసభ్యుడు వై. సుజనా చౌదరికి ఉపాధ్యాయ సంఘం వినతి పత్రం..

Vijayawada | విజయవాడ, ఆంధ్రప్రభ : ఉద్యోగులు, ఉపాధ్యాయులకు సంబంధించిన వేతన సవరణ, పెండింగ్ ఆర్థిక బకాయిలు, సిపిఎస్ రద్దు, మెమో 57 అమలు, పెండింగ్ కరువు భత్యాలు తదితర సమస్యలను శాసనసభలో ప్రస్తావించి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని కోరుతూ విజయవాడ పచ్చిమ నియోజకవర్గ శాసనసభ్యుడు వై. సుజనా చౌదరికి ఉపాధ్యాయ సంఘం ఎన్టీఆర్ జిల్లా కమిటీ వినతి పత్రం సమర్పించినట్లు సంఘం జిల్లా అధ్యక్షుడు కే. శ్రీనివాసరావు, ప్రధాన కార్యదర్శి సుందరయ్యలు తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన కార్యదర్శి సుందరయ్య మాట్లాడుతూ ఉద్యోగులు, ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి 12వ వేతన సవరణ కమిషన్ చైర్మన్‌ను వెంటనే నియమించాలని డిమాండ్ చేశారు.

పెండింగ్‌లో ఉన్న నాలుగు కరువు భత్యాలను తక్షణమే విడుదల చేయాలని, 29 శాతం తాత్కాలిక ఉపశమనం వెంటనే ప్రకటించాలని కోరారు. ఉద్యోగులు, పెన్షనర్ల బకాయిల చెల్లింపులకు స్పష్టమైన కార్యాచరణ ప్రణాళికను ప్రభుత్వం ప్రకటించాలని, సిపిఎస్ విధానాన్ని పూర్తిగా రద్దు చేసి, మెమో 57 ప్రకారం 2004కు ముందు నియామక ప్రక్రియ పూర్తైన వారికి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని వినతి పత్రంలో పేర్కొన్నట్లు తెలిపారు. ఈ నెల 11న జరగనున్న శాసనసభ సమావేశాల్లో పై సమస్యలన్నింటినీ ప్రస్తావించి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని శాసనసభ్యుడిని సంఘం నాయకులు కోరారు.

ప్రభుత్వం వెంటనే స్పందించకపోతే ఈ నెల 17న ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో ‘చలో విజయవాడ’ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని వినతి పత్రంలో స్పష్టం చేసినట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయ సంఘం ఎన్టీఆర్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఏ. సుందరయ్య, జిల్లా కార్యదర్శులు ఎన్. ముత్తయ్య, ఎం. లలిత శ్రీ, రాష్ట్ర ప్రచురణల కమిటీ సభ్యుడు ఏ. గోపాలకృష్ణ, నాయకురాలు ఎం. లక్ష్మీ కామేశ్వరి, కృష్ణా జిల్లా కార్యదర్శి పి.వి. రమణ, పెనమలూరు అధ్యక్షుడు బొల్లా వెంకటేశ్వరరావు, కె. వీరరాఘవయ్య, కె. శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply