Victory Venkatesh | దటీజ్ వెంకీ..
Victory Venkatesh | ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : విక్టరీని తన ఇంటి పేరుగా మార్చుకుని సక్సెస్ సాధిస్తూ.. నాటి నుంచి నేటికీ ఆడియన్స్ ని మెప్పిస్తున్న సీనియర్ హీరో వెంకటేష్ (venkatesh) ఈమధ్య సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమాతో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ సాధించి.. సెన్సేషన్ క్రియేట్ చేశారు. ఈ సంవత్సరంలో రెండు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నారు. డిసెంబర్ 13 వెంకీ పుట్టినరోజు. అభిమానులకు ఓ పండగ రోజు. ఇంతకీ.. ఈ ఇయర్ లో వెంకీ ఏ ఏ సినిమాలతో రాబోతున్నారు. నెక్ట్స్ ప్లాన్ ఏంటి..? వెంకీ బర్త్ డే సందర్భంగా స్పెషల్ స్టోరీ మీ కోసం..

కలియుగ పాండవులు సినిమాతో (Movie) .. కెరీర్ ఆరంభించి తొలి ప్రయత్నంలోనే సక్సెస్ సాధించారు వెంకటేష్. బ్రహ్మపుత్రుడు, స్వర్ణకమలం, ప్రేమ, బొబ్బలి రాజా, క్షణక్షణం, చంటి.. ఇలా వైవిధ్యమైన కథా చిత్రాలతో ఆకట్టుకుని తనకంటూ ఓ ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు. ఎన్నో హిట్లు, సూపర్ హిట్లు చూసినా, అలాగే ఫ్లాప్స్ చూసినా.. విజయాలకు పొంగిపోలేదు.. అపజయాలకు కృంగిపోలేదు. రెండింటిని సమానంగా తీసుకున్నారు. ఫెయిల్యూర్స్ నుంచి కూడా నేర్చుకుని.. కెరీర్ లో ఒక్కో మెట్టు ఎక్కుతూ అద్భుత విజయాలు సాధించారు.. ప్రేక్షక హృదయాల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్నారు వెంకీ..
మల్టీస్టారర్ చిత్రాలు చేయడంలో ముందుంటారు వెంకీ. కథ నచ్చితే.. అందులో ఆయన క్యారెక్టర్ నచ్చితే.. ఎవరితో అయినా సరే.. నటించేందుకు రెడీ అంటుంటారు. సీతమ్మ వాకిట్లో సరిమల్లె చెట్టు సినిమాలో సూపర్ స్టార్ మహేష్ బాబుతో (Superstar Maheshbabu) కలిసి నటించి సంచలన విజయం సాధించారు. ఆ సినిమాలో.. నేనింతే.. ఇలాగే ఉంటాను అంటూ.. పెద్దోడి క్యారెక్టర్ లో ఆకట్టుకున్నారు. ఇక గోపాల గోపాల సినిమాలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నటించడం.. ఆ సినిమా అందర్నీ మెప్పించడం తెలిసిందే. రామ్ తో కలిసి మసాలా, వరుణ్ తేజ్ తో కలిసి ఎఫ్ 2, ఎఫ్ 3, నాగచైతన్యతో కలిసి వెంకీ మామ సినిమాల్లో మెప్పించారు.

రానా నాయుడు అంటూ వెబ్ సిరీస్ లోకి కూడా ఎంట్రీ ఇవ్వడం.. ఆ సిరీస్ తో సెన్సేషన్ క్రియేట్ చేయడం తెలిసిందే. అలాగే కరోనా టైమ్ లో నారప్ప సినిమాను డైరెక్ట్ గా ఓటీటీలో (OTT) రిలీజ్ చేశారు. ఎప్పటికప్పుడు వైవిధ్యం కోసం తపించే వెంకీ.. సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో 300 కోట్లకు పైగా కలెక్ట్ చేసి సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసారు. రీజనల్ మూవీస్ లో హయ్యస్ట్ కలెక్షన్ సాధించిన సినిమాగా సంక్రాంతికి వస్తున్నాం న్యూ రికార్డ్ క్రియేట్ చేసింది. సీనియర్ హీరోల్లో ఈ రేంజ్ సక్సెస్ సాధించిన హీరో వెంకీ మాత్రమే. దీంతో వెంకీ సినిమాల పై మరింత క్రేజ్ పెరిగింది.
వెంకీ ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న మన శంకర్ వరప్రసాద్ గారు (Mana shankar varaprasad garu) నటిస్తున్నారు. సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి తెరకెక్కిస్తోన్న ఈ సినిమా సంక్రాంతికి వచ్చేందుకు రెడీ అవుతుంది. ఇందులో వెంకీ దాదాపు అర గంట సేపు కనిపించనున్నారు. ఈ సినిమా పై భారీ అంచనాలు ఉన్నాయి. వెంకీ నెక్ట్స్ మూవీని మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తో చేస్తున్నారు. ఈ సినిమాకి ఆదర్శ కుటుంబం అనే టైటిల్ అనౌన్స్ చేశారు. ఇటీవల సెట్స్ పైకి వచ్చిన ఈ సినిమాను సమ్మర్ లో రిలీజ్ చేయనున్నారు. అంటే.. ఈ ఇయర్ లో వెంకీ నుంచి మన శంకర్ వరప్రసాద్ గారు, ఆదర్శ కుటుంబం రిలీజ్ కానున్నాయి. ఈ సినిమా తర్వాత ఎటువంటి సినిమా చేయాలి అనే దాని పై ఆల్రెడీ వర్క్ జరుగుతుందని సమాచారం. కెరీర్ స్టార్ట్ చేసి దాదాపు నలభై సంవత్సరాలు అవుతున్నా.. యంగ్ హీరోలకు సైతం పోటీ ఇస్తున్నారు.. దటీజ్ వెంకీ అనిపిస్తున్నారు. సో.. మరిన్ని సినిమాలు చేయాలని.. మరిన్ని సక్సెస్ లు సాధించాలని కోరుకుంటూ హ్యాపీ బర్త్ డే అండ్ ఆల్ ది బెస్ట్ టు విక్టరీ వెంకటేష్.

