విశాఖపట్నం : సొంతగడ్డపై తెలుగు టైటాన్స్ జోరు కొనసాగుతుంది. ప్రొ కబడ్డీ లీగ్ (పీకెఎల్) సీజన్ 12లో ఆ జట్టు వరుసగా రెండో విజయం నమోదు చేసింది. ఆదివారం విశాఖపట్నంలోని రాజీవ్‌గాంధీ ఇండోర్ స్టేడియంలో జరిగిన పీకెఎల్ లీగ్ మ్యాచ్‌లో మాజీ చాంపియన్ బెంగాల్ వారియర్స్‌పై 44-34తో తెలుగు టైటాన్స్ సాధికారిక విజయం సాధించింది.
బెంగాల్ వారియర్స్ తరఫున రెయిడర్ దేవాంక్ (13 పాయింట్లు) సూపర్ టెన్‌తో మెప్పించినా.. తెలుగు టైటాన్స్ ఆల్‌రౌండ్ షోతో పైచేయి సాధించింది. తెలుగు టైటాన్స్ కెప్టెన్, ఆల్‌రౌండర్ విజయ్ మాలిక్ (11 పాయింట్లు), భరత్ (12 పాయింట్లు) సైతం సూపర్ టెన్ షో చేశారు.
పీకెఎల్ 12లో తెలుగు టైటాన్స్‌కు ఇది నాలుగు మ్యాచుల్లో రెండో విజయం కాగా.. బెంగాల్ వారియర్స్‌కు మూడు మ్యాచుల్లో రెండో పరాజయం కావటం గమనార్హం. బెంగాల్ వారియర్స్ రెయిడింగ్‌లో సత్తా చాటినా.. ట్యాకిల్స్ ఆ జట్టుకు కలిసి రాలేదు. ఫలితంగా మంచి ప్రదర్శన చేసినా పరాజయం తప్పలేదు. పది పాయింట్ల తేడాతో గెలుపొందిన తెలుగు టైటాన్స్ పాయింట్ల పట్టికలో నాల్గో స్థానానికి ఎగబాకింది.
పోరాడి ఓడిన వారియర్స్!
బెంగాల్ వారియర్స్‌తో మ్యాచ్‌లో తెలుగు టైటాన్స్ గత మ్యాచ్ ఉత్సాహం కొనసాగించింది. ఆరంభం నుంచీ పాయింట్ల వేటలో దూకుడుగా కనిపించింది. బెంగాల్ వారియర్స్ ట్యాకిల్స్‌పై ఎక్కవగా ఫోకస్ చేయగా.. అవేవీ అంత సఫలీకృతం కాలేదు. ట్యాకిల్స్‌లో 25 శాతం సక్సెస్ రేట్ ఆ జట్టును తీవ్రంగా దెబ్బతీసింది.
తెలుగు టైటాన్స్ తరఫున ఆల్‌రౌండర్లు భరత్, విజయ్ మాలిక్‌లు మ్యాచ్ అసాంతం ఆకట్టుకున్నారు. ఇద్దరూ సూపర్ టెన్ షోతో మెరువగా బెంగాల్ వారియర్స్‌ను ఆలౌట్ చేసిన తెలుగు టైటాన్స్ ప్రథమార్థం ముగిసే సరికి 23-14తో 9 పాయింట్ల ఆధిక్యం సాధించింది.
విరామం అనంతరం బెంగాల్ వారియర్స్ కాస్త తడబడినా ఆ తర్వాత పుంజుకుంది. మరో 10 ఆట మిగిలి ఉండగా ఇరు జట్ల పాయింట్ల అంతరం 16 పాయింట్లకు చేరింది. ఈ దశలో రెయిడర్ దేవాంక్‌కు డిఫెండర్లు నితేశ్ కుమార్, ఆశీష్‌లు తోడయ్యారు. దీంతో ద్వితీయార్థంలో తెలుగు టైటాన్స్‌తో దాదాపు సమానంగా బెంగాల్ వారియర్స్ పాయింట్లు సాధించింది.
టైటాన్స్ 17 సక్సెస్‌ఫుల్ రెయిడ్స్, ఓ సూపర్ రెయిడ్ చేయగా.. వారియర్స్ 16 సక్సెస్‌ఫుల్ రెయిడ్స్ చేసింది. ట్యాకిల్స్‌లో టైటాన్స్ సక్సెస్ రేటు 45.45గా ఉండగా.. వారియర్స్ 30.3 సక్సెస్ రేట్ మాత్రమే సాధించింది. ఇక్కడే వారియర్స్‌పై టైటాన్స్ పైచేయి సాధించింది.