Vehicular traffic | జాతీయ రహదారిపై సంక్రాంతి జాతర

Vehicular traffic | జాతీయ రహదారిపై సంక్రాంతి జాతర
- వరద ప్రవాహంలా తరలి వెళుతున్న వాహనాలు
- సంక్రాంతి సెలవులతో జాతీయ రహదారిపై పెరిగిన వాహనాల రద్దీ
- ఇబ్బంది పడుతున్న ప్రయాణికులు
Vehicular traffic | చౌటుప్పల్, ఆంధ్రప్రభ : హైదరాబాద్ – విజయవాడ 65వ నెంబర్ జాతీయ రహదారిపై సంక్రాంతి జాతర మొదలైంది. పాఠశాలలకు ఈనెల 10వ తేదీ నుంచి 16వ తేదీ వరకు సంక్రాంతి పండుగ సెలవులు ఇవ్వడంతో హైదరాబాద్ లో నివసిస్తున్న పల్లెవాసులంతా తమ తమ స్వగ్రామాలకు శుక్రవారం సాయంత్రం నుంచే తరలి వెళ్తుండడంతో వాహనాల రద్దీ తీవ్రంగా పెరిగింది. టోల్ ప్లాజాలా వద్దనే కాకుండా జాతీయ రహదారిపై కూడా వాహనాలు వరద ప్రవాహంలా వెళ్తుండడంతో వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోతున్నాయి.

చిట్యాల పట్టణంలో ఫ్లైఓవర్ బ్రిడ్జి నిర్మాణం కరణంగా వాహనాలు సాఫీగా వెళ్లలేకపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కాగా.. పాఠశాలకు 10వ తేదీ నుంచి సెలవులు ఇవ్వగా 11వ తేదీ నుంచి 18 వరకు కళాశాలలకు సెలవులు ఇచ్చారు. దీంతో శుక్రవారం మొదలైన వాహనాల రద్దీ శనివారం, ఆదివారం మరింత పెరిగే అవకాశం ఉంది. చౌటుప్పల్ ఏసిపి పటోళ్ల మధుసూదన్ రెడ్డి పర్యవేక్షణలో చౌటుప్పల్ ఇన్స్పెక్టర్ జి మన్మధకుమార్, ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ విజయ్ మోహన్ లు తమ సిబ్బందితో ట్రాఫిక్ నియంత్రణ కోసం ఎప్పటికప్పుడు తగిన చర్యలు తీసుకుంటూ నిరంతరం శ్రమిస్తున్నారు.

