స్వాతంత్రోద్యమానికి ఊపిరి పోసిన వందేమాతరం

స్వాతంత్రోద్యమానికి ఊపిరి పోసిన వందేమాతరం
మక్తల్, ఆంధ్రప్రభ : వందేమాతరం అనే నినాదం మన దేశ స్వాతంత్ర్య పోరాటానికి ఊపిరి పోసిందని శ్రీ సరస్వతి శిశు మందిర్ పాఠశాల ప్రధానాచార్యులు బి.కుర్మయ్య (B.Kurmaiah) అన్నారు. కశ్మీరు నుంచి కన్యాకుమారి వరకూ ప్రజలను స్వాతంత్రోద్యమం వైవు వందేమాతరం పరుగులు పెట్టించిందన్నారు. బంకిమ్ చంద్ర ఛటర్జీ రాసిన వందేమాతరం గేయం యావత్ దేశాన్ని ఉద్యమ స్ఫూర్తితో నడిపించిందన్నారు. ఈ గేయం శుక్రవారం నాటికి 150 ఏళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా దేశ వ్యాప్తంగా నిర్దేశిత సమయంలో ప్రజలందరూ వందేమాతరం ఆలపించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది.
ఈ మేరకు మక్తల్ పట్టణంలోని శ్రీ సరస్వతి శిశు మందిర్ పాఠశాలలో విద్యార్థులు, ఉపాధ్యాయులు కలిసి సామూహికంగా వందేమాతరం గేయాన్ని ఆలపించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వందేమాతరం స్ఫూర్తిని భావి తరాలకు అందించే బాధ్యత మనందరిది అని అన్నారు.
బ్రిటిషర్లను వందేమాతరం అనే మాటే భయపెట్టిందన్నారు. భారతీయుల నోట వందేమాతరాన్ని పలికితే జైళ్ల పాల్జేశారని గుర్తు చేశారు. బంకిమ్ చంద్ర ఛటర్జీ మన జాతికి అందించిన ఆ గేయంలో ఉన్న శక్తి ప్రతి ఒక్కరూ స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొనేలా చేసిందన్నారు ఆ గేయంస్ఫూర్తితోనే మనకు ఆంగ్లేయుల నుండి స్వాతంత్రం లభించింది అని ఆయన పేర్కొన్నారు వందేమాతరం ఒకరిలో స్పూర్తి కావాలని కుర్మయ్య ఆకాంక్షించారు.
