వందేమాతరం.. భారత ఆత్మను ప్రతిబింబించిన నినాదం

జిల్లా కలెక్టర్ డా. ఎ.సిరి
కర్నూలు బ్యూరో, ఆంధ్రప్రభ : భారత స్వాతంత్ర్య సమరానికి ప్రేరణనిచ్చిన వందేమాతరం గీతం 150 ఏళ్ల సంస్మరణోత్సవాన్ని పురస్కరించుకుని కర్నూలు నగరంలోని చారిత్రాత్మక కొండారెడ్డి బురుజు వద్ద ఘనంగా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డా. ఎ. సిరి పాల్గొని వందేమాతరం గీతాన్ని ఆలపించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ, వందేమాతరం గీతం భారత ఆత్మను ప్రతిబింబించిన నినాదం అని, అది ఒక జాతిని మేల్కొలిపిన శక్తిగా నిలిచిందని పేర్కొన్నారు. ఈ గీతం స్వాతంత్ర్య ఉద్యమకారులకు మనోబలం ఇచ్చి, సామాన్యులను సమరయోధులుగా మార్చిందని తెలిపారు.

బంకిమ్ చంద్ర ఛటర్జీ 1875 నవంబర్ 7న ఈ గీతాన్ని రచించారని, నేటి రోజు ఆ గీతానికి 150 సంవత్సరాలు పూర్తయిన చారిత్రాత్మక సందర్భమని కలెక్టర్ గుర్తుచేశారు. భారత మాత స్ఫూర్తిని ప్రతిబింబించే ఈ పాట దేశ ప్రజల ఐక్యతను, వైవిధ్యాన్ని జరుపుకునే ప్రతీకగా నిలిచిందని అన్నారు. ప్రతి ఒక్కరూ జాతీయత భావాన్ని పెంపొందించుకొని దేశాభివృద్ధికి కృషి చేయాలని కలెక్టర్ పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ నూరుల్ కమర్, సెట్కూరు సీఈవో డా. వేణుగోపాల్, జిల్లా విద్యాశాఖ అధికారి శ్యామ్యూల్ పాల్, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ అనూరాధ, ఆర్ఐఓ లాలప్ప, మున్సిపల్ కమిషనర్ కార్యాలయ సిబ్బంది, ఎన్సీసీ విద్యార్థులు, స్కౌట్స్ మరియు గైడ్స్, ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు, వివిధ విద్యాసంస్థల విద్యార్థులు, ప్రజలు పాల్గొన్నారు.

