- అస్తవ్యస్తంగా అభివృద్ధి పనులు
- ఇష్టానుసారంగా పనులు చేపడుతున్న గుత్తే దార్లు
- ఇంజినీరింగ్ అధికారుల పర్యవేక్షణ కరువు
- 33వార్డుల్లో రూ. 50కోట్లతో సీసి రోడ్డు, డ్రైనేజిల పనులు
- అధికారుల పర్యవేక్షణ లేదంటూ నిరసన తెలిపిన ఆయా వార్డుల కాలనీ వాసులు
వనపర్తి ప్రతినిధి, జూన్ 23(ఆంధ్రప్రభ ): ఏదైనా నిర్మాణ పని చేపట్టాలంటే సంబంధిత పర్యవేక్షణ చేపట్టే ఇంజినీరింగ్ అధికారులు దగ్గరుండి చేయించాల్సిందిపోయి, పనులు జరుగుతున్నప్పుడు అటువైపు వెళ్లకుండా, కేవలం పనులు అయ్యాక కొలతలు స్వీకరించేందుకు తమ సహాయకులను పంపిస్తున్నారు.రికార్డులు చేస్తున్న తరుణంలో పనుల్లో నాణ్యతకు పూర్తిగా తిలోదకాలు ఇవ్వబడుతున్నాయని తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. కోట్లాది రూపాయలు ఖర్చు చేసి చేపడుతున్న పనులు పది కాలాలపాటు ఉండాల్సిందిపోయి రెండు మూడు సంవత్సరాలకే దెబ్బతింటున్నాయి. రెండు నెలలకే వాటి నాణ్యతా లోపం బయటకు వస్తున్నది.వనపర్తి పట్టణంలోని ఆయా వార్డుల్లో చేపడుతున్న సీసి రోడ్లు, డ్రైనేజీల పనులను సంబంధిత అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో గుత్తేదార్లు ఇష్టాసారంగా చేపడుతున్నారని సోమవారం ఆయా వార్డుల కాలానివాసులు నిరసన తెలిపారు.

గుత్తేదార్లు ఇస్టానుసారంగా పనులు…
వనపర్తి మున్సిపాలిటీ పరిధిలోని 33వార్డుల్లో తెలంగాణ అర్బన్ ఫైనాన్స్ ఇన్స్ట్రాక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (టీయూఎఫ్ డిసి)నిధుల నుంచి సెప్టెంబర్ 2023లో ప్రభుత్వం రూ. 50కోట్ల నిధులు విడుదల చేసింది.ఆయా కాలనిలో కోట్ల వ్యయంతో చేపట్టే సీసి రోడ్లు, డ్రైనేజిల నాణ్యత తేలిపోతుంది. పనుల దక్కించుకున్న గుత్తేదార్లు ఇస్టాను సారంగా పనులు చేపట్టడం వల్ల పది కాలాలపాటు మన్నికగా ఉండాలి కానీ.. ఏడాది రెండేళ్లు తిరక్కుoడానే అద్వానంగా మారిపోయే అవకాశం ఉందని కాలనీ వాసులు వాపోతున్నారు. అధికారుల పర్యవేక్షణ లేకపోవడం వల్ల గుత్తేదార్లు ఇష్టానుసారంగా పనులు చేపడుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.సీసీ రోడ్లు, డ్రైనేజీల నిర్మాణంలో ఇసుకకు బదులుగా పిండి వంటి డస్ట్ వాడుతున్నట్లు పేర్కొంటున్నారు.డస్ట్‌ను వాడడంతో రోడ్డు నిర్మాణంలో నాణ్యత దెబ్బతింటున్నది. అధికారుల పర్యవేక్షణ లేదంటూ స్వయంగా మాజీ మున్సిపల్ కౌన్సిలర్. ఉంగ్లం తిరుమల్ స్వయంగా సంబంధిత ఇంజినీరింగ్ అధికారులకు ఫిర్యాదు చేసినా కనీసం చూసేందుకు రాకపోవడం గమనార్హం.
పర్సంటేజీలు అందితే చాలు..
సర్కారు నిధులతో పనులు జరుగుతున్న సమయంలో సంబంధిత పర్యవేక్షణ చేసే ఇంజినీరింగ్ అధికారులు అక్కడ ఉండి పని నాణ్యతను ఎప్పటికప్పుడు పరిశీలించాలి. ఏ పని ఎలా చేయాలనేది పూర్తిస్థాయిలో సదరు కాంట్రాక్టర్‌కు తెలియజేయాలి.వారి సూచనల మేరకు పనులు జరగాలి. కానీ వారు పని జరిగే ప్రదేశం వైపు వెళ్లడం లేదనే విమర్శలున్నాయి. ప్రధానంగా సీసీ రోడ్లు, డ్రైనేజిల నిర్మాణం చేపట్టే సమయంలో ఇంజినీరింగ్ అధికారులు కనీసం తొంగి చూడకుండా, పని పూర్తయిన తర్వాత ఎంబీ రికార్డు రాసేందుకు కేవలం కొలతలు తీసుకోవడానికి వెళ్తున్నారనే విమర్శలు బాహాటంగానే ఉన్నాయి. తమకు అందే పర్సంటేజీలు సక్రమంగా వస్తే చాలు.. పనులెలా ఉంటే తమకెందుకులే అనే విధంగా అధికారుల తీరు ఉంటుందనే విమర్శలు వినిపిస్తున్నాయి.ఇప్పటికైనా ఉన్నతాధికారులు తగిన చర్యలు చేపట్టి పనులు నాణ్యతగా జరిగేలా చూడాలని, పనులను స్వయంగా అధికారులు పర్యవేక్షించేలా చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు. దీనిపై సంబంధిత ఏఈ. మేఘనాథ్ కు వివరణ కోరేందుకు ఫోన్ చేయగా… ఫోన్ లో అందుబాటులోకి రాలేదు.

నిరసన తెలిపిన మాజీ కౌన్సిలర్ ఉంగ్లం తిరుమల్, కాలనీ వాసులు…
గత ప్రభుత్వ హయాంలో మంజూరు చేసిన రూ. 50 కోట్ల నిధులతో కాలనీలో చేపడుతున్న సిసి రోడ్డు, మురుగు కాలువల నిర్మాణ పనుల్లో అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో కాంట్రాక్టర్లు ఇష్టానుసారంగా పనులు చేపడుతున్నారని మాజి మున్సిపల్ కౌన్సిలర్. ఉంగ్లం తిరుమల్, కాలనీవాసులు సోమవారం నిరసన తెలిపారు.వనపర్తి పట్టణంలోని 33, 23,24 వార్డుల్లో సిసి రోడ్డు నిర్మాణం చేసిన వెంటనే వాహనాలు తిరగకుండా అడ్డంగా భారీ గేట్స్ కట్టమని కాంట్రాక్టర్, అధికారులకు అనేకమార్లు చెప్పిన పట్టించుకోవడం లేదని వాపోయారు.సీసి రోడ్డు నిర్మాణ పనులు జరుగుతున్నప్పుడు అడ్డంగా ఏమీ వేయకపోవడంతో రోడ్డుపై వాహనాలు, ఆటోలు, ట్రాక్టర్లు తిరుగుతుండటంతో రోడ్డు త్వరగా శిథిలావస్థకు వెళుతుందని చెప్పిన అధికారులు పట్టించుకోలేదన్నారు. అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో, కాంట్రాక్టర్ ఇష్టం వచ్చినట్లు రోడ్డు నిర్మాణం చేయడం పట్ల కోట్లాది ప్రజాధనాన్ని దుర్వినియోగం అవుతుందని సోమవారం కాలనిలో నిర్మాణ పనులు జరుగుతున్న దగ్గర నిరసన తెలుపుతూ మునిసిపల్ కమిషనర్ కు ఫోన్ ద్వారా సమాచారం తెలియజేశారు.వెంటనే సైట్ ఇన్స్పెక్టర్ శేఖర్ ని పంపించి ట్రాక్టర్ ద్వారా మట్టి కుప్పలను అడ్డంగా ఏర్పాటు చేయడంతో నిర్మాణ పనులను కొనసాగాయని తెలిపారు.