Vamsadhara | వంశధార యమ స్పీడ్…

Vamsadhara | వంశధార యమ స్పీడ్…
- రెండవదశ పనులు వేగవంతం
శ్రీకాకుళం, ఆంధ్రప్రభ బ్యూరో : వ్యవసాయ రంగానికి కూటమి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తోందని, అందులో భాగంగా సాగునీటి పారుదల ప్రాజెక్టుల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు.
జిల్లాలో ప్రధాన జీవనాధారమైన వంశధార ప్రాజెక్టు రూపకల్పనలో గత ప్రభుత్వం చేసిన తప్పిదాలవల్ల రైతులకు సాగునీరు అందకుండా పోతుందని, వేల కోట్లు ఖర్చు చేసినప్పటికీ వంశధార రిజర్వాయర్‌కు నీరు చేరకపోవడం ఆందోళనకరమని పేర్కొన్నారు.
అయితే ఈ ప్రాజెక్టు రూపకల్పనలో నేరడి బ్యారేజి అత్యంత కీలకమైనదని, ఈ బ్యారేజీకి సాంకేతి పరంగా, న్యాయపరంగా అడ్డంకులు తొలగనప్పటికీ… ఇంకా కొన్ని అవరోధాలు పెండింగ్ లో ఉన్నాయని వాటిని అధిగమించడానికి ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు. ప్రత్యామ్నాయంగా రిజర్వాయర్లు నింపడానికి ఎత్తిపోతల పథకాన్ని త్వరితగతిన పూర్తిచేసేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు.
2023వ సంవత్సరంలో గత ప్రభుత్వం ఎత్తిపోతల పథకానికి రూపకల్పన చేసినా.. పూర్తిస్థాయిలో నిధులు కేటాయించ కపోవడం వలన పూర్తి కాలేదని, చేసిన పనులకు నిధులు కూడా మంజూరు చేయలేదని చెప్పారు. కూటమి ప్రభుత్వం 176 కోట్ల రూపాయిల నిధులు చెల్లించేందుకు చర్యలు చేపడుతున్నట్లు వెల్లడించారు.
త్వరితగతిన పనులు పూర్తి చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. ఎత్తిపోతల పథకం ద్వారా గొట్టా బ్యారేజీ నుంచి 12 టీఎంసీల నీటిని వంశధార రిజర్వాయర్లలోకి పంపించి వరదల సమయాల్లో వృధా నీటిని జాగ్రత్త చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.
వంశధార కుడి కాలువకు సంబంధించి 2.4 కిలోమీటర్ల వద్ద ఈ లిఫ్ట్ ఇరిగేషన్ పనులు మొదలయ్యాయన్నారు. గత ప్రభుత్వం ఎత్తిపోతల పథకం పనులను ప్రారంభించినా పనులు వేగవంతం కాలేదన్నారు. రిజర్వాయర్ నిండితే వంశధార ప్రాజెక్ట్ కుడి, ఎడమ కాలువలకూ రెండు పంటలకు నీటిని అందుబాటులో ఉంచి ఆయకట్టును స్థిరీకరించవచ్చని ఆశాభావం వ్యక్తం చేశారు.
కూటమి ప్రభుత్వం లక్ష్యం మేరకు వంశధార, నాగావళి నదుల అనుసంధానం పూర్తైతే మరింత భూమి సాగులోకి రావడం ఖాయమన్నారు. అలాగే ఉద్దానం తాగునీటి పథకానికి అవసరమైన నీరు అందడంతో జిల్లా ప్రజల చిరకాల సమస్యలు తీరిపోతాయని, అలానే తాగునీటి సమస్యల పరిష్కారం సాధ్యం అవుతుందని మంత్రి అచ్చెన్న స్పష్టం చేశారు.
ఈ ప్రాంత అవసరాలకు అనుగుణంగా ప్రాజెక్టుల నిర్వహణ, వాటికి అనుగుణంగా అవసరమైన నిధుల విడుదలపై రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎంతో ముందుచూపుతో వ్యవహరిస్తూ.. వెనుకబడిన ప్రాంతాల రైతాంగానికి మేలు చేసేందుకు ఎక్కువ కృషి చేస్తున్నారనుటకు ఎలాంటి సందేహాలకు తావే లేదని, ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
