చిక్కిన వివాహిత.. పోలీసు స్టేషన్‌లో వలవల
బయ్యారం, ఆంధ్ర ప్రభ : ఆమె ఒకరిని నమ్మింది. ప్రేమించింది. పెళ్లి చేసుకుంది. ఈ ప్రేమ పెళ్లి కొన్నాళ్లకే పెటాకులైంది. పోలీసు స్టేషన్(Police Station) గడప తొక్కింది. అక్కడో మరో మగాడి దగా తప్పలేదు. ఐతే.. ఈ సారి ఖాకీ బాబు వాడుకున్నాడు. మరో దుష్యంతుడి అవతారం ఎత్తాడు. ఇంకేముందీ .. ఆ అహల్య పోలీసు స్టేషన్‌లో లబోదిబోమంది.
మహబూబ్ బాద్ జిల్లా బయ్యారంలో చోటు చేసుకున్న ఈ ఘటన వివరాలు ఇలా ఉన్నాయి. పోలీసుల సమాచారం మేరకు.. బయ్యారం మండల(Bayyaram Mandal) కేంద్రానికి చెందిన ఒక మహిళ ఓ వ్యక్తిని ప్రేమ పెళ్లి చేసుకుంది. కొన్నాళ్లు సజావుగా జరిగిన ఈ దాంపత్య బంధంలో ఇద్దరి మధ్య మనస్పర్ధలు ఏర్పడ్డాయి. పోలీస్ స్టేషన్లో ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేసుకున్నారు. ఇద్దరికి కౌన్సెలింగ్(Counseling) చేసిన పోలీసులు ఇళ్లకు పంపించారు.
భర్త నడవడికపై తీవ్ర అసంతృప్తిలో ఉన్న ఈ మహిళకు అదే ఠాణానాలో పని చేస్తున్న దినేశ్ నాయక్(Dinesh Nayak) అనే కానిస్టేబుల్ వల వేశాడు. ఈ దంపతుల మధ్య మనస్పర్ధలు ఆసరాగా చేసుకుని ఆమెకు మాయమాటలు చెప్పాడు. పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు. శారీరకంగా దగ్గరయ్యాడు. ఆ బాధితురాలు కానిస్టేబుల్‌ను పెళ్లి చేసుకోమని పట్టుబట్టింది. ఆ కానిస్టేబుల్ ససేమిరా అనటంతో ధితురాలు స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. బాధితుల ఫిర్యాదు మేరకు ఎస్సై తిరుపతి(Tirupati) కేసు దర్యాప్తు చేస్తున్నారు.

