Uppada Drowned | మాయపట్నం ప్రజలకు తక్షణ సాయం చేయండి ‍ ‍- కలెక్టర్ కు పవన్ ఆదేశం

వెలగపూడి – కాకినాడ జిల్లా ఉప్పాడ తీరంలో రాకాసి అలల ఉద్ధృతి కారణంగా మాయపట్నం గ్రామం జలమయం కావడంపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ వెంటనే స్పందించారు. మాయపట్నం గ్రామంలోని ప్రజలకు తక్షణ సహాయక చర్యలు చేపట్టాలని కాకినాడ జిల్లా కలెక్టర్ తో పాటు సంబందిత అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు. కాకినాడ జిల్లా కలెక్టర్‌తో పాటు ఇతర అధికారులతో పవన్ వర్చువల్ గా సమీక్ష నిర్వహించారు. అధికారులు అక్కడి ప్రస్తుత పరిస్థితిని వివరిస్తూ, మాయపట్నం వద్ద అలల తాకిడి తీవ్రంగా ఉండటంతో అనేక ఇళ్ళు నీట మునిగినట్లు తెలిపారు.

దీనిపై స్పందించిన ఉప ముఖ్యమంత్రి, వరద బాధితులకు అవసరమైన అన్ని రకాల సహాయక చర్యలు అందించాలని స్పష్టం చేశారు. ముఖ్యంగా, వారికి ఆహారం, పాలు, మరియు మంచి నీరు తక్షణమే అందించాలని ఆదేశించారు. అంతేకాకుండా, ఎలాంటి ఆరోగ్య సమస్యలు తలెత్తకుండా ఉండేందుకు వైద్య సిబ్బందిని, ఔషధాలను అందుబాటులో ఉంచుకోవాలని దిశానిర్దేశం చేశారు.

రానున్న రోజుల్లో భారీ వర్ష సూచన ఉన్న నేపథ్యంలో, అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. గతంలో అక్కడి తీరంలో చేపట్టిన రక్షణ చర్యలు, నిర్మించిన రక్షణ గోడ, జియో ట్యూబ్ గురించి కూడా ఉప ముఖ్యమంత్రి ఆరా తీశారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడటమే ప్రభుత్వ ప్రాధాన్యత అని ఆయన ఈ సందర్భంగా తెలియజేశారు.

Leave a Reply