బీచ్ రోడ్డు ధ్వంసం..
ఆంధ్రప్రభ, యు.కొత్తపల్లి : మోంథా తుఫాన్ మంగళవారానికి తీవ్రంగా బలపడడంతో ఉప్పాడ సముద్రం పది మీటర్ల మీద పొంగి అలలు విరుచుకుపడుతున్నాయి.రాకాసి అలలకు సూరాడపేట, మాయా పట్నం తదితర తీర ప్రాంత మత్స్యకార గృహాలు సముద్రపు అలలకు నేలమట్టమవుతున్నాయి. మరోపక్క పల్లిపేట, రంగంపేట వద్ద ఉన్న బీచ్ రోడ్డు రక్షణ రాళ్లు తెగడంతో కోతకు గురవుతూ సముద్రపు అలలు మరోపక్క భారీ వర్షానికి నీరు గ్రామంలోకి చొచ్చుకు వస్తున్నాయి.
భారీగా వీస్తున్న ఈదురు గాలులతో కొత్తపల్లి, రమణక్కపేట, నాగులపల్లి ప్రాథమిక పాఠశాల.2 మూలపేట తదితర గ్రామాల్లో విద్యుత్ స్తంభాలు, భారీ వృక్షాలు నేలకు ఒరిగాయి.సముద్రుడు ఉగ్రరూపం దాల్చడంతో అధికారులు, నాయకులు తీర ప్రాంత వాసులను హెచ్చరిస్తూ పునరావస కేంద్రాలకు తరలిస్తున్నారు. ఏలూరు రేంజ్ ఐజి అశోక్ కుమార్, ఆర్డీవో మల్లిబాబు పలువురు ఉన్నతాధికారులు ఉప్పాడ తీరాన్ని పర్యటించి ప్రజలు సురక్షితంగా ఉండాలని కోరుతున్నారు.
విపత్తు ఏ సమయంలోనైనా విరుచుకు పడితే ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. ఇప్పటికే తీర ప్రాంతాల్లో సుమారు 26 పునరావస కేంద్రాలు ఏర్పాటు చేసి తీర ప్రాంత గ్రామస్తులను తరలించి వారికి ఆహారంతో పాటు అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నామని అధికారులు తెలిపారు.
కోతకు గురవుతున్న గృహాలు
సముద్ర గట్టును అనుకొని ఉన్న సూరాడ పేట,మాయా పట్నం మత్స్యకార గృహాలు కోతకు గురవుతున్నాయి.తుఫాను సమయాలలో నిత్యం మత్స్యకార గృహాలు వందలాదిగా నేలమట్టం కాక తప్పదు ఎన్నిసార్లు నాయకులకు అధికారులకు మొరపెట్టుకున్న కోతను నివారించడానికి గట్టు ఏర్పాటు చేయలేకపోతున్నారు ?తుఫాన్లు వచ్చినప్పుడు మాత్రం నాయకులు అధికారులు హడావుడి చేసి సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలని సూచనలు చేస్తారు తప్ప గృహాలు కోతకు గురికాకుండా నివారించాలని మత్స్యకారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఉప్పాడ పర్యటనలో భాగంగా కాకినాడ ఎంపీ తంగిళ్ళ ఉదయ శ్రీనివాస్ని మత్స్యకారులు నిలదీయడం జరిగింది. ఇప్పటికే సిమెంటు రోడ్లు, చెట్లు, గృహాలు కోతకు గురయ్యాయి తుఫాను సమయంలో కాకుండా అధికారులు, నాయకులు మత్స్యకార గ్రామాలలో పర్యటించి సమస్యలు తెలుసుకుంటే బాగుంటుంది అని మత్స్యకారులు తెలుపుతున్నారు.




