స్పాట్లో 8 మంది దుర్మరణం
ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్: ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh)లోని బులంద్‌షహర్ జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident)లో ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదం బులంద్‌షహర్‌లోని అరనియా పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న నేషనల్ హైవే 43పై జరిగింది. కాస్గంజ్ నుంచి రాజస్థాన్‌లోని గోగామేడీలో జహర్‌వీర్ (గోగాజీ) దర్శనం కోసం 60 మంది భక్తులు ట్రాక్టర్లో బయలుదేరారు.
బులంద్‌షహర్ జిల్లాలోకి చేరుకున్న వెంటనే, వారి ట్రాక్టర్‌ను వెనుక నుంచి వేగంగా వస్తున్న భారీ కంటైనర్ ఢీకొంది. ఈ దుర్ఘటనలో ఎనిమిది మంది అక్కడికక్కడే మరణించగా, మరో 43 మందికి తీవ్ర గాయాలయ్యాయి.
ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే సహాయక చర్యలు చేపట్టి, గాయపడిన వారిని సమీప ఆసుపత్రులకు తరలించారు. గాయపడిన వారిలో చాలా మంది పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తోంది. సమాచారం అందుకున్న జిల్లా కలెక్టర్, పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలను పర్యవేక్షించారు.
మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి గురైన వాహనాలను రోడ్డుపై నుంచి తొలగించి, ట్రాఫిక్‌ను సాధారణ స్థితికి తెచ్చారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటన పట్ల పలువురు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.