Bandi Sanjay | హిందుత్వమే నా శ్వాస

Bandi Sanjay | హిందుత్వమే నా శ్వాస
హిందుత్వం ఆగిపోతే నా శ్వాస ఆగిపోయినట్లే
Bandi Sanjay | హుజూరాబాద్, ఆంధ్రప్రభ : హిందుత్వం తన శ్వాస అని, హిందుత్వం ఆగిపోతే తన శ్వాస ఆగిపోయినట్లే అని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ (Bandi Sanjay Kumar) అన్నారు. ఈ రోజు హుజురాబాద్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. హిందుత్వంతోనే తెలంగాణలో బీజేపీని అధికారంలోకి తీసుకొచ్చే వాతావరణం తీసుకొస్తామన్నారు. జీహెచ్ఎంసీలో హిందుత్వం వల్లే 4 నుండి 48 సీట్లు గెలిచామన్నారు. ముస్లిం, క్రిస్టియన్ అనే తేడా లేకుండా మోడీ ప్రభుత్వం (Modi government) అందరికీ సంక్షేమ పథకాలు అందిస్తోందని తెలిపారు. ఆ ముస్లింలు బీజేపీకి ఎందుకు ఓట్లు వేయడం లేదు? అని ప్రశ్నించారు. ఎన్నికలొస్తే మసీదుల్లో ముస్లింలంతా ఒక్కటై ప్రతిజ్ఞ తీసుకుని బీజేపీకి వ్యతిరేకంగా ఎందుకు ఓటేస్తున్నారన్నారు.
12శాతం ముస్లింలంతా ఒక్కటైతే తప్పు లేనిది 80 శాతం హిందువులంతా ఓటు బ్యాంకుగా మారితే తప్పేంది? అని చెప్పారు. హిందుత్వ వాదంతోనే గడపగడపకూ తిరుగుతా… తెలంగాణలో రామరాజ్యాన్ని తీసుకొచ్చి తీరుతామన్నారు. సర్పంచ్ ఎన్నికల్లో (Sarpanch election) కాంగ్రెస్ కు ఓటేస్తే పంచాయతీలకు నయాపైసా రాదని అన్నారు. పంచాయతీల్లో జరుగుతున్న అభివృద్ధి అంతా కేంద్ర నిధులతోనే, కేంద్ర నిధుల కోసమే పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తున్నారన్నారు. బీజేపీకి ఓటేసి గెలిపిస్తేనే పంచాయతీలు బాగుపడతాయని చెప్పారు. కాంగ్రెస్ రెండేళ్ల వైఫల్యాలపై కాషాయ సమరభేరీకి శ్రీకారం చుడుతున్నామన్నారు. కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో ఈనెల 26న ‘సంతకాల సేకరణ’ కార్యక్రమం నిర్వహించనున్నట్లు చెప్పారు.
