మునుగోడు, జులై 4 (ఆంధ్రప్రభ): రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన నిరుద్యోగ హామీలను అమలు చేయాలని, నిరుద్యోగుల సమస్యను పరిష్కరించాలని శుక్రవారం చేపట్టిన చలో సెక్రటేరియట్ (Chalo Secretariat) ముట్టడి కార్యక్రమానికి వెళ్లకుండా గురువారం రాత్రి డివైఎఫ్ఐ (DYFI) నాయకులను అక్రమంగా అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ లో నిర్భందించారు.
ఈసందర్భంగా డివైఎఫ్ఐ జిల్లా సహాయ కార్యదర్శులు కట్ట లింగస్వామి (Katta Lingaswamy), మిర్యాల భరత్ (Miryala Bharat) లు మాట్లాడుతూ.. ప్రభుత్వం నిరుద్యోగ సమస్యలు పరిష్కరించాలని కొట్లాడితే అరెస్టు చేయడం ఏంటని ప్రశ్నించారు. రాజకీయ నాయకుల వ్యక్తిగత ఆస్తులు ఏమైనా అడుగుతున్నామా! ఎన్నికల్లో ప్రకటించిన హామీలను మాత్రమే నెరవేర్చాలని కోరుతున్నామన్నారు. ఎన్నికల్లో యువతకు అనేక హామీలిచ్చి రాష్ట్ర ప్రభుత్వం మోసం చేసిందని గుర్తు చేశారు. రాజీవ్ యువ వికాసం పథకంతో మరోసారి యువతను రాష్ట్ర ప్రభుత్వం మోసం చేసిందన్నారు. అరెస్టు చేసినంత మాత్రాన ఉద్యమాలను ఆపలేరని తమ సంఘం ఆధ్వర్యంలో ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నించకుండా ఉండబోమన్నారు.
నిరుద్యోగుల సమస్యలు పరిష్కరించే వరకు ఉద్యమాలు కొనసాగుతాయని హెచ్చరించారు. ఆరు గారెంటీలే కాకుండా 7వ గ్యారెంటీ ప్రజాస్వామ్యం కాపాడటమే అని మాటలు చెప్పిన రేవంత్ రెడ్డికి ప్రజాస్వామ్యం గుర్తుకు వస్తలేదా, ముందస్తు అరెస్టులు చేయడమే 7వ గ్యారంటీనా అని ప్రశ్నించారు. అరెస్ట్ చేసిన వారిలో డివైఎఫ్ఐ మండల కార్యదర్శి యాసరాని వంశీకృష్ణ, మండల ఉపాధ్యక్షులు యాట శ్రీకాంత్, మండల నాయకులు పగిళ్ల యాదయ్య, తదితరులు ఉన్నారు.