కపాస్ కిసాన్ యాప్‌పై అవగాహన..

కపాస్ కిసాన్ యాప్‌పై అవగాహన..

నారాయణపేట ప్రతినిధి, ఆంధ్రప్రభ : పత్తి కొనుగోళ్లకు సంబంధించి సీసీఐ (కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా) ప్రవేశపెట్టిన కపాస్ కిసాన్ మొబైల్ యాప్ పై గ్రామ స్థాయి నుండి మండల స్థాయి అధికారులు రైతులకు పూర్తి అవగాహన కల్పించాలని కలెక్టర్ సిక్తాపట్నాయక్ ఆదేశించారు. గురువారం కలెక్టరేట్‌లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్‌ నుంచి రెవెన్యూ, వ్యవసాయ, మార్కెటింగ్ శాఖ అధికారులతో కలెక్టర్ గూగుల్ మీట్ నిర్వహించారు.

ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ, కపాస్ కిసాన్ యాప్ రైతులకు ఎంతో మేలు చేస్తుందని, యాప్ వినియోగంపై మండల స్థాయి అధికారులు బాధ్యతగా ప్రచారం చేయాలని సూచించారు. ఈ నెల 24న ప్రతి గ్రామంలో పంచాయతీ కార్యదర్శులు,జీపీఓలు రైతులకు యాప్ వినియోగం, పత్తి విక్రయానికి స్లాట్ బుకింగ్ విధానం వివరించాలని ఆదేశించారు. మండల తహసీల్దార్లు, ఎంపీడీఓలు యాప్‌పై విస్తృత ప్రచారం చేపట్టాలని సూచించారు. పత్తి కొనుగోలు ప్రక్రియ సమర్థవంతంగా సాగేందుకు స్లాట్ బుకింగ్ విధానంపై రైతులకు స్పష్టమైన అవగాహన కల్పించాలని అన్నారు.

జిల్లాలో 7 పత్తి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపిన ఆమె, రైతులు తమ మొబైల్‌ ఫోన్లలో కపాస్ కిసాన్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకొని పత్తి విక్రయానికి స్లాట్ బుకింగ్ చేసుకోవచ్చని తెలిపారు. డిజిటల్ క్రాప్ సర్వే సమయంలో రైతులు ఇచ్చిన ఫోన్ నంబర్లు మారితే వాటిని ఏఈఓలు అప్డేట్ చేయాలని సూచించారు. సిసిఐ ఆదేశాల ప్రకారం పత్తి నాణ్యత ప్రమాణాలు, తేమ శాతంపై రైతులకు వ్యవసాయ అధికారులు అవగాహన కల్పించాలన్నారు.

ఈ సీజన్‌లో జిల్లాలో సుమారు 21,21,984 క్వింటాళ్ల పత్తి దిగుబడి వస్తుందని, క్వింటాలుకు రూ. 8,110 కనీస మద్దతు ధర చెల్లించనున్నట్లు కలెక్టర్ వివరించారు.జిల్లాలో పత్తి కొనుగోళ్లు ఎటువంటి ఇబ్బందులు లేకుండా జరగేందుకు సిసిఐ, వ్యవసాయ, మార్కెటింగ్ శాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.ఈ సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్లు శ్రీను, సంచిత్ గంగ్వర్, ట్రైనీ కలెక్టర్ ప్రణయ్ కుమార్, డిప్యూటీ కలెక్టర్ శ్రీరామ్ ప్రణీత్, మార్కెటింగ్ అధికారి బాలామణి, వ్యవసాయ శాఖ అధికారి జాన్ సుధాకర్, మార్కెట్ కార్యదర్శి భారతి తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply