విజయవాడ | ఇవాళ ఉదయం 9. 30 గంటలకి తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు జరగనున్నాయి. ఈ సందర్భంగా పంచాంగ శ్రవణం ఏర్పాటు చేయనున్నారు.
ఈ ఉగాది వేడుకలకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడితో పాటు మరి కొందరు మంత్రులు, నేతలు హాజరు కానున్నారు. అలాగే, మధ్యాహ్నం 3 గంటలకు స్వర్ణ భారతి ట్రస్ట్ లో ఉగాది వేడుకలకు కూడా సీఎం పాల్గొననున్నారు. ఇక, సాయంత్రం పీ4 కార్యక్రమం ప్రారంభించనున్న ఏపీ ప్రభుత్వం.. సాయంత్రం 5 గంటలకు పీ4 కార్యక్రమానికి హాజరు కానున్న సీఎం చంద్రబాబు.
చంద్రబాబు శుభాకాంక్షలు
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ ఏపీ ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలియజేశారు. విశ్వవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలకు విశ్వావసు నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు చెప్పారు సీఎం చంద్రబాబు. వచ్చేవన్నీ మంచి రోజులనే సానుకూల దృక్పథంతో కొత్త ఏడాదిని స్వాగతిస్తున్నట్లు ఆయన చెప్పుకొచ్చారు. ఈ సందర్భంగా నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టబోతున్నట్లు వెల్లడించారు. ప్రతి ఒక్కరూ రాబోయే కాలంలో గణనీయమైన ప్రగతి సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు చంద్రబాబు ఆకాంక్షించారు. విశ్వావసు నామ సంవత్సరం తెలుగు ప్రజలందిరిలో సంతోషాన్ని నింపాలని, సకల విజయాలనూ అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు ఎక్స్ వేదికగా సీఎం చంద్రబాబు ట్వీట్ చేశారు.
నారా లోకేష్.
శ్రీ విశ్వావసు నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలిపారు మంత్రి లోకేశ్. తెలుగువారిలో కొత్త ఆనందాలు తెచ్చే పండుగల్లో ఉగాది ప్రత్యేకమైందని చెప్పారు. ఈ పర్వదినాన్ని అందరూ సంతోషంగా జరుపుకోవాలని ఆకాంక్షించారు. ఈ తెలుగు సంవత్సరం ప్రజల ఆశలు, ఆశయాలు నెరవేర్చి ఏడాది పొడవునా సుఖసంతోషాలతో జీవించాలని దేవుడిని ప్రార్థించారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ మరొక్కసారి శ్రీ విశ్వావసు నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు అంటూ ట్వీట్ చేశారు.