చెరువులో పడి ఇద్దరు గొర్రెల కాపరులు మృతి..

కోనరావుపేట, ఆంధ్రప్రభ : రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం ధర్మారం గ్రామంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన ఇద్దరు గొర్రెల కాపరులు చెరువులో పడి మృతి చెందారు.
వివరాల ప్రకారం, తమ గొర్రెలను సమీపంలోని చెరువుకు నీరు త్రాగించేందుకు తీసుకువెళ్లిన సమయంలో అనుకోని ప్రమాదం జరిగింది. గొర్రెలను నీటిలోకి దింపుతున్న సమయంలో వారు అదుపుతప్పి లోతైన ప్రాంతంలోకి వెళ్లి గల్లంతయ్యారు. ఈ ఘటనలో మండయ్య, లక్ష్మీరాజం మృతి చెందినట్లు సమాచారం.
ఈ ఘటన గ్రామంలో తీవ్ర విషాదాన్ని కలిగించింది. సమాచారం అందుకున్న స్థానికులు, పోలీసులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకుని గాలింపు చర్యలు చేపట్టారు. గల్లంతైన వారి మృతదేహాలను వెలికితీసే చర్యలు కొనసాగుతున్నట్లు అధికారులు తెలిపారు. ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉందని ఎస్సై ప్రశాంత్ రెడ్డి పేర్కొన్నారు.
