నాలుగు రోజుల్లో రెండు ఆవుల మృతి..!

నాలుగు రోజుల్లో రెండు ఆవుల మృతి..!

  • హైరానా పడుతున్న సరిహద్దు గ్రామాలు..!

ఉమ్మడి ఆదిలాబాద్, ఆంధ్రప్రభ : మహారాష్ట్ర తాడోబా అటవీ ప్రాంతం నుండి చిరుత పులులు అదిలాబాద్ జిల్లాలో ప్రవేశించి అలజడి రేపుతున్నాయి. గత ఏడాది బజార్హత్నూర్(Bazaarhatnoor) మండలం డేడ్రా అటవీ శివారులో గిరిజన రైతులపై దాడి చేసి తీవ్రంగా గాయపరచగా, ఇప్పుడు చిరుతపులులు మేతకు వెళ్లే పశువులను వేటాడి చంపుతున్నాయి.

గత నాలుగు రోజుల్లోనే బోత్ మండలం మర్లపల్లి అటవీ శివారులో చిరుతలు దాడి చేసి రెండు ఆవులను హతమార్చిన ఘటనతో శివారు ప్రాంతాల ప్రజలు ఉలిక్కి పడుతున్నారు. మహారాష్ట్రకు ఆనుకొని ఉన్నబోత్ మండలం కరత్వాడ, ఘన్పూర్, మర్లపల్లి శివారులోకి రెండు చిరుతపులులు మహారాష్ట్ర నుండి తరలి వచ్చి ఇక్కడే మ‌కాం వేసినట్టు తెలుస్తోంది.

ఆదిలాబాద్ జిల్లా(Adilabad District) బోథ్ అటవీ రేంజ్ పరిధిలో సరిహద్దు గ్రామాల ప్రజలు చిరుతపులుల అలికిడితో భయం గుప్పెట్లో జీవనం సాగిస్తున్నారు. నిగిని అటవీ ప్రాంత సమీపంలో దుర్వ గంగారాం కు చెందిన ఆవు, రేండ్లపల్లి(Rendlapalli) గ్రామానికి చెందిన సడుముకి లక్ష్మణ్‌(Sadumuki Laxman)కు చెందిన ఆవులు మేత మేస్తుండగా చిరుత పులి దాడి చేసి రెండు ఆవులను పొట్టన పెట్టుకున్నాయి. రైతులు పంటచేలకు వెళ్లాలంటేనే వణికి పోతున్నారు.

పంట చేతికి వస్తున్నతరుణంలో చిరుతలు సంచరిస్తుండడంతో వ్యవసాయ పోలాలలోకి వెళ్లాలంటేనే భయంగా ఉందని, పంట ఉత్పత్తులు ఇంటికి చేరేవరకు భయంగా ఉందని రైతులు వాపోతున్నారు. వ్యవసాయ కూలీలు కూడా పంటచేలకు వెళ్లాలంటే భయపడిపోతున్నారు.

అటవీ విస్తీర్ణం పెరగడంతో పాటు దప్పిక తీర్చుకునేందుకు తాగునీటి సౌకర్యం ఉండడంతో చిరుతపులులు మహారాష్ట్ర తడోబా పులుల సంరక్షణ కేంద్రం నుండి దారి తప్పి ఆదిలాబాద్ జిల్లాలోకి ప్రవేశిస్తున్నాయి. ఆవాసం కోసం ఆరాటపడుతూ అడవుల్లో మేతకు వచ్చే పశువులను వేటాడి చంపుతున్నాయి. బోత్ సరిహద్దు(Both Border) అడవులు వన్యప్రాణులకు ఆవాసాలుగా మారాయని అటవీ అధికారులు పేర్కొంటున్నారు.

అయితే చిరుత పులి దాడిలో మృతి చెందిన పశువుల యజమానులకు ప్రభుత్వం తరపున నష్టపరిహారం వచ్చేలా చూస్తామని అటవీ శాఖ అధికారులు పేర్కొంటున్నారు. అధికారులు అడవిలో ట్రాప్ కెమెరాలు(Trap Cameras) ఏర్పాటు చేసి నిరంతరం పర్యవేక్షణ చేస్తూ అటవీ సమీపంలో ఉన్న గ్రామాల ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. పొలం పనుల కోసం వెళ్లే వారు గుంపులు గుంపులుగా వెళ్లాలని అధికారులు సూచిస్తున్నారు. ఏది ఏమైనా వరుసగా చిరుతపులుల సంచారం, పశువుల పై దాడులు ఆదిలాబాద్ జిల్లాలో అలజడి రేపుతున్నాయి.

Leave a Reply