ఇరువురు కానిస్టేబుళ్లుకు గాయాలు
శ్రీ సత్య సాయి బ్యూరో అక్టోబర్ 22 (ఆంధ్రప్రభ ): శ్రీ సత్య సాయి జిల్లా కదిరి రూరల్ మండలం అల్లిపూర్ తండాలో నాటు సారా తయారీదారులు ఎక్సైజ్ పోలీసుల పై కట్టెలతో దాడి చేసారు. బుధవారం సాయంత్రం జరిగిన ఈ దాడిలో ఇరువురుకి గాయాలు అయ్యాయి. కదిరి రూరల్ అప్గ్రేడ్ పోలీస్ స్టేషన్ సిఐ నిరంజన్ రెడ్డి తెలిపిన మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. తండాలో నాటు సారా తయారీ దారుల పై అనంతపురం ఎక్సైజ్ పోలీసులు దాడులు చేపట్టారు. అయితే నాటు సారా తయారీదారులు ఎక్సైజ్ పోలీసుల పై తిరగబడ్డారు.
కర్రలతో దాడులు చేసిన ఈ సంఘటనలో ఎక్సైజ్ కానిస్టేబుల్స్ వెంకటనారాయణ, వెంకట ప్రసాద్ గాయపడ్డారు. ముఖ్యంగా వెంకటనారాయణ తలకు బలమైన గాయం అయింది. వెంటనే బాధితులను కదిరి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. విషయం తెలిసిన వెంటనే ఎక్సైజ్ పోలీస్ అధికారులు కదిరి ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకొని బాధితులను పరామర్శించారు. సాధారణ తనిఖీలలో భాగంగా అల్లిపూర్ తండాలో ఎక్సైజ్ పోలీసులు వెళ్లినప్పుడు తయారీదారులు కానిస్టేబుల్ పై ఉన్నఫలంగా దాడులు చేసారని.. ఎక్సైజ్ పోలీసుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టినట్లు సిఐ తెలిపారు.