BJP : బీజేపీలోకి ఇద్దరు కాంగ్రెస్ నేతలు జంప్
స్థానిక ఎన్నికల వేళ తెలంగాణలో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. మాజీ ఎంపీ సీతారాం నాయక్, బీజేపీ ఎస్టీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు డా. కల్యాణ్ నాయక్ నేతృత్వంలో తాజాగా ఇద్దరు కాంగ్రెస్ నాయకులు బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. వారికి పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు, ఎంపీ డీకే అరుణ ఢిల్లీలోని తన నివాసంలో పార్టీ కండువా కప్పి బీజేపీలోకి ఆహ్వానించారు.
బీజేపీలో చేరిన వారిలో సేవాలాల్ సేన రాష్ట్ర అధ్యక్షుడు సభావత్ శ్రీనివాస్ నాయక్, మహబూబ్ నగర్ ఎంపీ అభ్యర్థి సభావత్ విజయ ఉన్నారు. కష్టపడి పనిచేస్తే తప్పక గుర్తింపు ఉంటుందని ఈ సందర్భంగా ఎంపీ డీకే అరుణ అన్నారు. కేంద్రంలో నరేంద్ర మోదీ సర్కార్ చేస్తున్న అభివృద్ధి, సంక్షేమాలకు ఆకర్షితులై కమలం పార్టీలో చేరడం ఆనందంగా ఉందన్నారు. ఇక రాష్ట్రంలో అధికార కాంగ్రెస్ ఇచ్చిన హామీలను తుంగలో తొక్కిందని అరుణ మండిపడ్డారు. మహిళలకు ఉచిత బస్సు పథకం తప్పితే, కాంగ్రెస్ ఇచ్చిన ఏ హామీ కూడా సరిగా అమలు కావడం లేదని దుయ్యబట్టారు. కాంగ్రెస్ ఇటీవల చేపట్టిన కులగణన తప్పులతడకగా ఉందని విమర్శించారు.
బీసీ జనాభాను తక్కువ చేసి చూపించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పాలనతో రాష్ట్ర ప్రజలు విసిగిపోయారని, ఎప్పుడు ఎన్నికలు వచ్చినా బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని అరుణ జోస్యం చెప్పారు. కాగా, మాజీ ఎంపి సీతారాం నాయక్, బీజేపీ ఎస్టీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కళ్యాణ్ నాయక్ నేతృత్వంలో ఈ చేరికలు జరిగాయి. ఈ కార్యక్రమంలో ఎస్టీ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రవి నాయక్ నేనావత్, రాష్ట్ర నాయకులు రితేష్ రాథోడ్, తదితరులు పాల్గొన్నారు.