విజయవాడ – ఎపీలో వైసీపీ అధికారం కోల్పోయాక క్రమంగా దూరమవుతూ వచ్చిన ఆ పార్టీ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి, ఆ తర్వాత ఏకంగా పార్టీకి రాజకీయాలకే గుడ్ బై చెప్పేశారు.
ఆ తర్వాత వ్యవసాయం చేసుకుంటానంటూ ప్రకటించి సైలెంట్ అయిన సాయిరెడ్డి.. ఈ మధ్య ఉన్నట్లుండి రూటు మార్చారు. జగన్ ను వదిలేసి ఆయన చుట్టూ ఉన్న కోటరీని మాత్రమే టార్గెట్ చేయడం మొదలుపెట్టిన సాయిరెడ్డి.. తాజాగా మరో ట్వీట్ చేశారు.
ఇందులో విజయసాయిరెడ్డి.. అసలు చరిత్రలో కోటరీ అనేది ఎలా పుట్టింది, కోటరీ వల్ల రాజులకు జరిగిన నష్టం ఏంటి ? అప్పట్లో రాజులు ఇలాంటి పరిస్ధితులు ఎదుర్కున్నప్పుడు ఎలా వ్యవహరించారో గుర్తుచేస్తూ వైఎస్ జగన్ కు ఆయన హిత బోధ చేశారు. అంతే కాదు తన చుట్టూ ఉన్న కోటరీ వల్ల జగన్ కు జరుగుతున్న నష్టాన్ని కూడా పరోక్షంగా విజయసాయిరెడ్డి ఈ ట్వీట్ లో వివరించారు. దీంతో సాయిరెడ్డి ట్వీట్ వైరల్ అవుతోంది.
పూర్వకాలంలో మహారాజులు కోటల్లో ఉండేవారని, కోటలో ఉన్న రాజుగారి చుట్టూ కోటరీ ఉండేదని విజయసాయిరెడ్డి తెలిపారు. ప్రజలు ఎన్ని కష్టాలు పడుతున్నా, రాజ్యం ఎలా ఉన్నా ఆ కోటరీ ఏం చేసేదంటే, ఆహా రాజా! ఓహో రాజా అంటూ పొగడ్తలతో రాజు కళ్ళకు గంతలు కట్టి, తమ ఆటలు సాగించుకునేదన్నారు. దీనితో రాజూ పోయేవాడు, రాజ్యం కూడా పోయేదన్నారు.
కోటరీ కుట్రల్ని గమనించిన మహా రాజు, తెలివైన వాడు అయితే మారు వేషంలో ప్రజల్లోకి వచ్చి, ఏం జరుగుతోందో తనకు తానుగా తెలుసుకునేవాడని సాయిరెడ్డి తెలిపారు. వారిమీద వేటు వేసి, రాజ్యాన్ని కాపాడుకునేవాడన్నారు.
కోటలో రాజుగారు బాగుండాలంటే సామాన్య ప్రజల్లోకి రావాలని సూచించారు. ప్రజల మనసెరిగి వారి ఆకాంక్షలను అర్థంచేసుకోవాలన్నారు. లేదంటే కోటరీ వదలదని, కోట కూడా మిగలదన్నారు. ప్రజాస్వామ్యంలో అయినా జరిగేది ఇదే అంటూ ట్వీట్ ముగించారు.