దేశాయి బీడీ కంపెనీపై చర్యలు తీసుకోవాలి.. టియుసిఎల్ డిమాండ్

భీమ్‌గల్ రూరల్, ఆంధ్రప్రభ : చట్టాన్ని ఉల్లంఘిస్తూ బీడీ కార్మికులను దోపిడీ చేయడం కింద దేశాయి బ్రదర్స్ లిమిటెడ్ బీడీ కంపెనీ యజమానిపై చట్టరూపంగా చర్యలు తీసుకోవాలని టియుసిఎల్ నాయకులు, కే. రాజేశ్వర్ డిమాండ్ చేశారు.
శుక్రవారం బడా భీమ్‌గల్ గ్రామంలో బీడీ కార్మికులతో కలిసి టియుసిఎల్ నాయకులు దేశాయి బ్రదర్స్ యజమాన్యానికి వ్యతిరేకంగా పోస్ట్ కార్డ్స్ పై సంతకాలు చేయించి, ఆవిష్కరించారు.
తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ నిజామాబాద్ రూరల్, కామారెడ్డి సంయుక్త జిల్లా ఉపాధ్యక్షుడు కే. రాజేశ్వర్ మాట్లాడుతూ, “దేశాయి బ్రదర్స్ లిమిటెడ్ బీడీ కంపెనీ యజమాన్యం 1000 బీడీలకు అగ్రిమెంట్ ప్రకారం 261.97 పైసలు చెల్లించాల్సినట్లయితే, 10 రూపాయలు తక్కువ చెల్లించడం ద్వారా కార్మికుల శ్రమను దోపిడీ చేస్తున్నారు. గత కొన్ని నెలల నుండి ఈ సమస్యను తెలియజేశా కానీ ఎలాంటి పరిష్కారం లేదు. వెంటనే 1000 బీడీలకు సరియైన చెల్లింపులు, సరిపడే ఆకు-తంబాకు దారం ఇవ్వాలి. అదనంగా బలవంతంగా ఇచ్చే తినుబండారాలు, చిప్స్ ప్యాకెట్స్ ఇవ్వడం కూడా ఆపాలి” అని హెచ్చరించారు.
వీరు, యజమాన్యం ఈ సమస్యలను తక్షణమే పరిష్కరించకపోతే, వివిధ బీడీ కార్మికులను ఏకం చేసి పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ ఏరియా నాయకులు, గ్రామంలోని బీడీ కార్మికులు పాల్గొన్నారు.
