త్రిగుణాకారునికి త్రిదళ ఆలంకారం

సమస్త జగత్తును దహించేందుకు కారణమైన హాలాహలాన్ని తన గొంతుకలో దాచుకున్న నీలకంఠుడు ప్రేమను కురిపించే బోళాశంకరుడు… దైవత్వానికి, ఆధ్యాత్మికతకు నిరాడంబర జీవనమే ప్రాతిపదిక అని ప్రపంచానికి చాటి చెప్పేందుకు శివుడు ఆ రీతిలోనే జీవించి చూపించాడు. శివుడి మూడు నేత్రాలను సూర్యుడు, చంద్రుడు, అగ్నిగా వర్ణిస్తుంది. అది వెలుగుకు మూలంగా భావిస్తాం… అంటే, యావత్‌ ప్రపంచాన్నీ ప్రకాశవంతం చేసేది త్రినేత్రుడు. శివుడు ఎంచుకున్న ఆయుధం త్రిశూలం. త్రిశూలంలో మూడు వాడియైన మొనలుంటాయి. అవి కోరిక, చర్య, జ్ఞానం అనే మూడు శక్తులను సూచిస్తాయి. తపస్సు-యోగం-శాంతం… ఈ మూడూ మూర్తీ భవించిన శివతత్త్వం, ఆ శక్తినే జగన్మాతగా, శక్తిమంతుని ఈశ్వరుడిగా, వారిరువురి ఏకత్వాన్ని ‘అర్ధనారీశ్వరుడి’గా సంభావించారు శుద్ధమై, శాంతమై, శుభమై ఉన్న స్వయం ప్రకాశ పరమేశ్వర స్వరూపం. అదే అన్నింటిలో లీనమై ఉంటూ, అన్నింటినీ లీనం చేసుకొనేది. కనుక ‘జ్యోతిర్లింగం’ అంటారు.
శివపంచాక్షరికి ఆది గురువు పరమేశ్వరుడు. పంచభూతారాధన శివార్చనలో ప్రధాన భాగం. ప్రకృతి పురుషులు అభేదమని తెలియజేయడానికి శివుడు అర్ధనారీశ్వరుడయ్యాడు. విత్తనంలోని మొక్కలా సృష్టి యావత్తూ పరమేశ్వరుడిలో దాగి ఉంది. బాల్యం, ¸°వనం వంటి దశలు, కల మెలకువ లాంటి స్థితులు, సుఖ-దు:ఖాలవంటి అవస్థల వెనక సాక్షిగా గమనించే చైతన్యమే దక్షిణామూర్తి. ప్రకృతి ఏర్పరచిన న్యాయ సూత్రాల ప్రకారం ప్రపంచం నడుస్తుంది. అదే శివతత్త్వం. సృష్టి స్థితులను లయం వరకు నడిపించిన శివుడు లయకారుడు. జన్మ జన్మకూ కొంతైనా జ్ఞానాన్ని పొందుతూ, చివరి జన్మలో సంపూర్ణ జ్ఞానాన్ని పొందడమే మోక్షం. అది పొందేకాలం లింగోద్భవ కాలం… కాబట్టి శివరాత్రి పర్వదినాన్ని రాత్రివేళలో జరుపుకొంటాం.
మహాశివరాత్రి రోజు ప్రతిఒక్కరూ ఉపవాసం, జాగరణ ఉండటం, రోజంతా శివనామస్మరణతో గడపడం, ప్రదోషవేళయందు శివుని అభిషేకించడంతో పాటు విశేషించి శివుడికి బిల్వార్చన, రుద్రాభిషేకం వంటివి చేయడం శ్రేయస్కరం. ఉపవాసం అంటే ఉపం ఆవాసం. అంటే శివనామస్మరణతో శివుడికి దగ్గరగా ఉండటం. శివరాత్రి పూట చేసే శివార్చన, శివాభిషేకం వల్ల శరీరంలో తేజస్సు వస్తుంది. అలాగే, భగవంతుడి మీద సాధకులకు, మోక్షమార్గంలో ప్రయత్నించేవారికి ఇది విశేష సమయం. శ అంటే శివుడు, వ అంటే శక్తి అని శివ పదమణి మాల చెబుతోంది. శివ అంటే శుభం, ఆనందం, మంగళం, కైవల్యం, శ్రేయం అని అర్థాలు. శివనామస్మరణ చేస్తూ పంచామృతములతో, బిల్వ పత్రాలతో ఎవరైతే అభిషేకిస్తారో, పూజిస్తారో వారి పాపాలు నశించి పుణ్యం ప్రాప్తించి శివానుగ్రహం కలుగుతుందని పురాణాలు పేర్కొంటున్నాయి.
”త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రం చ త్రియాయుధం త్రిజన్మ పాపసంహారమ్‌ ఏకబిల్వం శివార్పణం” అంటూ మహా దేవుడిని పూజిస్తారు. ఈ త్రిదళ బిల్వ పత్రంలో కుడివైపు విష్ణువు, ఎడమవైపు బ్ర#హ్మ, మధ్యలో శివుడు కొలువై ఉంటారట. హిందూ ధర్మంలో బిల్వ పత్రానికి అత్యంత విశిష్ట స్థానం ఉంది. దీనిని మారేడు దళం అని కూడా అంటారు. బిల్వపత్రం మహాదేవుడికి అత్యంత ప్రీతిపాత్రమైనది. వేదాలు బిల్వాన్ని బ్ర#హ్మవర్చస్సు సముపార్జనకు అనుసంధానిస్తున్నాయి. యాగంలో బిల్వాన్ని ఉపయోగించడం వల్ల ఆహారం, శ్రేయస్సు, శక్తి, సంతానం సమృద్ధిగా లభిస్తాయి. బిల్వం ఎంత గొప్పదంటే, దాని గురించి విశేషంగా ఒక ఉపనిషత్తు ఉంది. బిల్వోపనిషత్తులో శివుడు స్వయంగా వామదేవ ఋషికి బిల్వం గొప్పతనం గురించి బోధించాడు. బిల్వం యొక్క ఎడమ ఆకుపై బ్రహ్మ, కుడివైపు ఆకుపై విష్ణువు మధ్య ఆకుపై శివుడు ఉంటారు. ఇతర దేవతలందరూ బిల్వ ఆకు కొమ్మపై ఉంటారు. ఒకే కొమ్మకు అనుసంధానించబడిన మూడు ఆకులు ఈ వాస్తవాన్ని సూచిస్తాయి. బిల్వ పత్రం వెనుక భాగంలో అమృతం ఉంటుంది. కాబట్టి, శివునికి బిల్వ పత్రంతో అర్చన చేసేటప్పుడు, ఆకు పైకి ఎదురుగా ఉండాలి. వెనుకభాగం లింగం/విగ్రహాన్ని తాకాలి.

  • వాడవల్లి శ్రీధర్‌

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *