HBD | పుడమి పులకరించేలా వృక్షార్చన.. కేసీఆర్ జ‌న్మ‌దినం రోజున అద్భుత కానుక‌

  • తెలంగాణలోని ప‌లు ప్రాంతాల‌లో జోరుగా మొక్క‌లు నాటే కార్య‌క్ర‌మ‌
  • గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఆధ్వ‌రంలో అయిదు లక్ష‌లు మొక్క‌లు
  • హైద‌రాబాద్ సెయింట్ ఫిలిమినా స్కూల్లో మొక్క‌లు నాటిన సంతోష్

హైద‌రాబాద్, ఆంధ్ర‌ప్ర‌భ – కేసీఆర్‌ 71వ పుట్టినరోజు సందర్భంగా కార్యక్రమం గ్రీన్ ఇండియా ఛాలెంజ్ వ్య‌వ‌స్థాప‌కుడు, బిఆర్ఎస్ ఎంపి జోగినిపల్లి సంతోష్‌కుమార్ ఇచ్చిన పిలుపు మేర‌కు తెలంగాణాలోని పలు ప్రాంతాల‌లో వృక్షార్చ‌న కార్య‌క్ర‌మాలు నేడు ఘ‌నంగా నిర్వ‌హించారు.. రాష్ట్రవ్యాప్తంగా 5 లక్షల మొక్కలు నాటాల‌ని ఆయ‌న ఇచ్చిన పిలుపు బీఆర్‌ఎస్‌ శ్రేణులు పెద్దసంఖ్యలో క‌దిలివ‌చ్చి మొక్క‌లు నాటారు.

ఇక హైద‌రాబాద్ లోని సెయింట్ ఫిలిమినా స్కూల్, చ‌ర్చి ఆవ‌ర‌ణ‌లో జ‌రిగిన కార్య‌క్రమంలో సంతోష్ కుమార్ స్వ‌యంగా పాల్గొని మొక్క‌లు నాటారు. అంత‌కు ముందు కేక్ కటింగ్ చేసి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ కార్య‌క్ర‌మంలో సంతోష్ తో పాటు మాజీ ఎమ్మెల్యే స్టీఫెన్ సన్, మాజీ కార్పొరేషన్ చైర్మన్ ముజీబుద్దీన్ పాల్గొన్నారు.

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ తో…

రాష్ట్రం, దేశం పచ్చబడాలనే సంకల్పంతో బీఆర్‌ఎస్‌ మాజీ ఎంపీ సంతోష్‌కుమార్‌ ఆధ్వర్యంలో చేపట్టిన ‘గ్రీన్‌ ఇండియా చాలెంజ్‌’ ఇప్పటికే అద్భుత ఫలితాలతో అప్రతిహతంగా కొనసాగుతున్నది. 2018 జూలై 27న ‘హరా హైతో భరా హై’ అనే నినాదంతో ప్రారంభమైన ఈ హరిత యజ్ఞంలో దేశవ్యాప్తంగా అనేక మంది సెలబ్రిటీలు, పార్టీలకతీతంగా రాజకీయ నాయకులు స్వచ్ఛందంగా పాల్గొని మొక్కలు నాటాలని ప్రజలకు, అభిమానులకు పిలుపునిచ్చారు. నేడు తెలంగాణ తొలి సీఎం, బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ పుట్టినరోజును పురస్కరించుకొని గ్రీన్‌ ఇండియా చాలెంజ్‌ ఆధ్వర్యంలో ‘వృక్షార్చన’కు శ్రీకారం చుట్టింది. ప్రతి ఒక్కరూ మూడు మొక్కలు నాటి సెల్ఫీ దిగి 9000365000 నంబర్‌కు వాట్సాప్‌ చేయాలని సంస్థ కోరింది. ఇందులో భాగంగా గ్రామ, మండల, నియోజకవర్గాలు, పట్టణాల్లో వృక్షార్చనపై క్షేత్ర స్థాయిలో మాజీ ఎంపీ సంతోష్‌ కుమార్‌ అవగాహన కల్పించారు. పోస్టర్లు ఆవిష్కరించి వృక్షార్చనపై విస్తృత ప్రచారం నిర్వ‌హించారు.. నేడు కెసిఆర్ జ‌న్మదినం కావ‌డంతో పెద్ద సంఖ్య‌లో మొక్క‌లు నాటాల‌నే సంతోష్ పిలుపుతో భారీగా కెసిఆర్ అభిమానులు, బిఆర్ఎస్ నేత‌లు, శ్రేణులు క‌దిలివ‌చ్చి వృక్షార్చ‌న చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *