(ఆంధ్రప్రభ, ఎన్టీఆర్ బ్యూరో ) : కృష్ణా-గుంటూరు పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గ ఎన్నికల పోలింగ్‌ను ప్రశాంత, స్వేచ్ఛాయుత వాతావరణంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలను తావులేకుండా, పారదర్శకంగా విజయవంతంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ డా.జి.లక్ష్మీశ తెలిపారు. నగరంలోని సబ్ కలెక్టర్ కార్యాలయంలోని ఎన్నికల సామాగ్రి పంపిణీ కేంద్రాన్ని బుధవారం కలెక్టర్ లక్ష్మీశ సందర్శించి, ప్రక్రియను పరిశీలించారు. చెక్ లిస్ట్ ప్రకారం సామగ్రి అందుతోందో.. లేదో చూశారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. 112 పోలింగ్ స్టేషన్లకు సంబంధించి ప్రిసైడింగ్, సహాయ ప్రిసైడింగ్, ఇతర ప్రిసైడింగ్ అధికారులకు విజయవాడ, తిరువూరు, నందిగామలోని డిస్ట్రిబ్యూషన్ కేంద్రాల ద్వారా బ్యాలెట్ బాక్సులు, బ్యాలెట్ పేపర్లు, ఇతర పోలింగ్ మెటీరియల్‌ను పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. పోలింగ్ మెటీరియల్‌కు, సిబ్బందికి ఎలాంటి ఇబ్బంది లేదని.. 18 రూట్లలో సిబ్బందిని, మెటీరియల్‌ను తరలించేందుకు వాహనాలు, భద్రతా సిబ్బందిని నియమించడం జరిగిందన్నారు. 78,063 మంది ఓటర్లు ఉన్నారని.. ఓటర్లు ప్రశాంత వాతావరణంలో తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఏర్పాట్లు చేశామని.. పోలీసు శాఖ ఆధ్వర్యంలో 450మంది పోలీసు సిబ్బందితో పాటు తక్షణ స్పందన బృందాలు అందుబాటులో ఉంటాయన్నారు. రాజకీయ పార్టీల ప్రతినిధులతోనూ ప్రత్యేకంగా సమావేశాలు నిర్వహించి, సందేహాలను నివృత్తి చేసినట్లు తెలిపారు.
అన్ని పోలింగ్ స్టేషన్లలో వెబ్ క్యాస్టింగ్:…
అన్ని పోలింగ్ స్టేషన్లలో వెబ్‌క్యాస్టింగ్‌తో పాటు మైక్రో అబ్జర్వర్లు ఉంటారని కలెక్టర్ లక్ష్మీశ వెల్లడించారు. పోలింగ్ స్టేషన్లలోని పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తూ సజావుగా పోలింగ్ జరిగేలా చూడటం జరుగుతుందన్నారు. ఈవీఎం కాకుండా బ్యాలెట్ పేపర్‌తో ఎన్నిక జరగనున్నందున సిబ్బందికి రెండుదశల్లో పూర్తిస్థాయిలో శిక్షణ ఇవ్వడం జరిగిందన్నారు. బ్యాలెట్ బాక్సులు, బ్యాలెట్ పేపర్ల నిర్వహణపై సమగ్ర శిక్షణ ఇవ్వడం జరిగిందన్నారు.
పోలింగ్ పూర్తయిన అనంతరం పటిష్ట భద్రతతో బ్యాలెట్ బాక్సులను స్ట్రాంగ్ రూమ్‌లకు చేర్చడం జరుగుతుందని తెలిపారు. భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) మార్గదర్శకాల ప్రకారం, ఎన్నికల ప్రవర్తనా నియమావళి మేరకు జిల్లాలో ఎన్నికలను విజయవంతంగా నిర్వహించేందుకు మీడియా కీలక భాగస్వామ్యం అందిస్తోందని.. ఇదేవిధంగా రాజకీయ పార్టీలు, అభ్యర్థులు, ఓటర్లు, అధికారులు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కలెక్టర్ లక్ష్మీశ కోరారు. కార్యక్రమంలో డీఆర్‌వో ఎం.లక్ష్మీనరసింహం, విజయవాడ ఆర్‌డీవో కావూరి చైతన్య తదితరులు పాల్గొన్నారు.