EC | ఎన్నికల్లో పాల్గొనే అధికారులు, సిబ్బందికి శిక్షణ
- 15వ తేదీలోపు శిక్షణ పూర్తి చేయాలని ఈసీ ఆదేశం
రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలకు ఏర్పాట్లు ముమ్మరమయ్యాయి. ఎన్నికల నిర్వహణకు సంబంధించి సిబ్బంది శిక్షణపై రాష్ట్ర ఎన్నికల సంఘం (ఈసీ) కీలక ఆదేశాలు జారీ చేసింది. ఫిబ్రవరి 15లోగా శిక్షణ పూర్తి చేయాలని ఆదేశాల్లో పేర్కొంది. ఈ నెల 10, 12, 15న పీవో, ఏపీవోలకు శిక్షణ ఇవ్వనుండగా, 10వ తేదీలోగా సిబ్బందిని నియమించాలని రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసింది. కాగా తొలుత జడ్పిటీసీ, ఎంపీటీసీ ఆ తర్వాత గ్రామ పంచాయతీ (సర్పంచ్) ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.
కాగా గ్రామపంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ ఈ నెల 10వ తేదీన ప్రకటించే అవకాశమున్నట్టు సమాచారం. ఫిబ్రవరి 24న మొదటి విడత ఎన్నికలు, మార్చి నెల 3న రెండవ విడత ఎన్నికలు, 10వ తేదీన మూడో విడత ఎన్నికలు జరిపేందుకు సమాయత్తమవుతున్నట్టు చెబుతున్నారు. పదవ తరగతి వార్షిక పరీక్షలు మార్చి 21వ తేదీన ప్రారంభమవుతున్నందున ఈ లోపు ఎన్నికల ప్రక్రియను పూర్తి చేయాలని ప్రభుత్వం ప్రతిపాదిస్తోంది.