ఈదులాటలో విషాదం..
( తిరుపతిరూరల్ , ఆంధ్రప్రభ ): తిరుపతి జిల్లా తిరుపతి రూరల్ మండలంలో వేదాంతపురం సమీపంలో ఉన్న స్వర్ణముఖి నదిలో ఇసుక దిబ్బలపై సరదాగా ఆడుకుంటూ ఈత కోసం స్వర్ణముఖిలోకి దిగిన నలుగురు యువకులు గల్లంతయ్యారు. ఈ విషాదం శుక్రవారం సాయంత్రం నాలుగు గంటలకు జరిగింది. వేదాంతపురం పంచాయతీ అగ్రహారానికి చెందిన విష్ణు, మణిరత్నం, కృష్ణ, ప్రకాశ్ (17), చిన్న (15), తేజు (19), బాలు (16) ఈత కోసం అగ్రహారం నుంచి ఏడుగురు మైనర్లు సీపీఆర్ విల్లాస్ వెనుక స్వర్ణముఖి నదిలోకి ఈత కోసం వెళ్లారు. స్వర్ణముఖిలో ఇసుక దిబ్బలు ఉండడంతో ఇసుక దిబ్బలపై కొంతసేపు ఆడుకున్నారు. తరువాత ఈత కోసం స్వర్ణముఖి నదిలోకి దిగారు. ఈత కోసం స్వర్ణముఖి నది నీటి ప్రవాహంలోకి దిగిన ప్రకాశ్ (17), చిన్న (15), తేజు (19), బాలు (16) నీటి ప్రవాహం ఎక్కువగా రావడంతో తట్టుకోలేక ప్రవాహంలో కొట్టుకుపోయారు.
ఈ నలుగురు నీటిలో కొట్టుకుపోవటాన్ని గ్రహించి ఇసుక దిబ్బలపై యువకులు గట్టిగా కేకలు వేయటంతో.. స్థానికులు విష్ణు, మణిరత్నం, కృష్ణను కాపాడారు. స్వర్ణముఖిలో యువకులు గల్లంతైన విషయాన్ని తిరుచానూరు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో సర్కిల్ ఇన్స్పెక్టర్ సునీల్ నాయుడు తన సిబ్బందితో ప్రమాద స్థలికి చేరుకొని గాలింపు చర్యలు చేపట్టారు. పోలీసుల గాలింపులలో బాలు(16) దొరికాడు. పోలీసులు వెంటనే బాలు ఛాతిని గట్టిగా అదిమి ( సిపిఆర్) ప్రాణాలను కాపాడేందుకు ప్రయత్నించారు. కానీ బాలు అప్పటికే మృతి చెందినట్లు పోలీసులు గుర్తించారు. పోలీసులతోపాటు ఎన్ డి ఆర్ ఎస్ సిబ్బంది స్వర్ణముఖిలో గాలింపులు చేస్తున్నారు. స్వర్ణముఖిలో నలుగురు యువకులు గల్లంతు కావడం, పోలీసుల గాలింపుల చర్యలో బాలు (16) మృతదేహాన్ని బయటకు తీయడంతో అగ్రహారంలో విషాదఛాయలు కలుముకున్నాయి.
గల్లంతైన యువకుల తల్లిదండ్రులు బోరుమని వినిపిస్తున్నారు. విషయం తెలుసుకున్న స్థానిక శాసనసభ్యులు ఎమ్మెల్యే పులివర్తి వెంకట మణి ప్రసాద్ ( నాని) ప్రమాద స్థలానికి చేరుకుని అధికారులతో చర్చించారు. జిల్లా ఎస్పీ ఎల్ సుబ్బరాయుడు, ఏ.ఎస్.పి రవి మనోహర్ ఆచారి, డీఎస్పీ బి ప్రసాద్, రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్ రామ్మోహన్ రావు, తహశీల్దార్ రామాంజనేయులు నాయక్, స్థానిక టిడిపి నాయకులు, పోలీస్ సిబ్బంది గాలింపు చర్యలను ముమ్మరం చేస్తున్నారు. స్వర్ణముఖి నదిలో మైనర్లు గల్లంతైన ఘటన పట్ల ఎమ్మెల్యే పులపర్తి నాని తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. యువకులు స్వర్ణముఖిలో గల్లంతైన విషయాన్ని సీఎం ఓ కార్యాలయానికి ఎమ్మెల్యే పులివర్తి నాని అందజేశారు.

